Read more!

కవిత బంధువుల నివాసాలలో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత బంధువుల నివాసాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం (మార్చి 23) ఉదయం నుంచి కవిత బంధువుల నివాసాలే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి.

 కవిత ఆడపడుచు అఖిల నివాసంలో , కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.   గత శుక్రవారం(మార్చి 15న) లిక్కర్  కుంభకోణంలో  తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ సందర్భంగా ఆమె  మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలిచారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. పది రోజుల కస్టడీ విధించింది. కవిత తన అరెస్టు అక్రమం అంటూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు తీసుకున్న సుప్రీం విచారణ వాయిదా వేసింది.

ఇక ఆమె బెయిలు పిటిషన్ ను కూడా సుప్రీం తిరస్కరించింది. బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. స్థొమత ఉన్నందున బెయిల్ కోసం సుప్రీం ను ఆశ్రయించినంత మాత్రాన ఆ పిటిషన్ ను తాము విచారించజాలమని పేర్కొంది. దీంతో కవిత మరి కొంత కాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు ఢిల్లీలో తమ కస్టడీలో ఉన్న కవితను విచారిస్తున్నఈడీ ఆ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ లోని కవిత బంధువుల నివాసాలలో విస్తృత సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.