16న విచారణకు రండి.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు

విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. వాస్తవానికి మంగళవారం (జనవరి 7) విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్ కు ఈడీ ఇటీవల నోటీసులు పంపింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ పై అదే రోజు తీర్పు వెలువరిస్తుందనీ, కనుక విచారణకు హాజరు కావడానికి మరి కొంత సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో  కేటీఆర్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఈడీ  విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారు. అన్నట్లుగానే ఆయనను ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు.

ఇలా ఉండగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్డు డిస్మిస్ చేసిన తరువాత ఈడీ, ఏసీబీలు దూకుడు పెంచాయి. ఏసీబీ ఏకంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టింది.

ఇక ఈడీ విచారణకు తేదీ ఖరారు చేస్తూ కేటీఆర్ కు నోటీసులు దాఖలు చేసింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా  ఒక వేళ తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలంటూ కేవియెట్ దాఖలు చేసింది.