ఎన్నికల కమిషన్ హెచ్చరిక...గోడమీద పోస్టర్
posted on Oct 25, 2022 @ 3:26PM
ప్రతీ గల్లీలో జనం పరిగెడుతున్నారు. గ్రామకూడలిలో వేపచెట్టుకింద ఒక వ్యక్తి ఆభరణాలు పంచు తున్నాడు. పిల్లలయితే ఉంగరాలు, పెద్దవాళ్లయితే గాజులు,గొలుసులు, వడ్డాణాలూను. మన రాజుకింత బుద్ధుంటే బావుండేది అనుకుంటూ అవి తీసుకున్న ఆనందంలో రాజుని వీలయినంతగా తిట్టుకుం టున్నారు. అలానే ఇళ్లకి చేరుకున్నారు. యువరాజుగారికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎవరక్కడ అని అరిచాడు. భటుడు వచ్చాడు. ఏం జరుగుతోంది అంటూ అరిచాడు. ప్రభూ పక్కూరి వాల్లు, చిన్న రాజ్యంవారూ వచ్చి మన ప్రజలకు కానుకలు ఇస్తున్నారు. మా ఆడోళ్లూ తెచ్చు కున్నారు అన్నాడు. రాజుకి కోపం నషాలానికి అంటింది. ప్రజలా మేకలా అలా వెంటబడి మీదబడి తీసు కుంటారా? అని కోపగించుకున్నారు. బాగా ఆాలోచించి మంత్రికి వాళ్లని తరిమే యమన్నాడు. మంత్రి వెళ్లి ఒక వడ్డాణం తీసుకుని ఇప్పుడు కాదు మరో రోజు రండి అని పంపేశాడు. ఈసమాచారం విని రాజుగారు ఒక ప్రకటన చేయించారు.. ఎవరూ ఎవరి కానుకలను తీసుకోరాదని. ఎవరు కానుకలు ఇవ్వడానికి వచ్చినా వెంటనే కబురుపెట్టమని లేకుంటే చెట్టుకి కట్టేయ మని ఆదేశించారు. అది చదివి జనం ఊరుకున్నారు. జరిగేది జరగక మానదు, రాజుగారి హెచ్చరి కతో అన్నీ ఆాగిపోతే రాజ్యం ఎందుకైతది? ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ ఓటరుని ఆకట్టుకోవడానికి అనేక బహుమానాలు ఇవ్వడం మీదనే ఆసక్తి చూపుతున్నాయి. అసలు ఇప్పటికే కోట్లు ప్రవాహంగా వెళిపోయాయి. కొంతే పట్టుబడిందని మీడియా కోడయి కూస్తోంది. ఇప్పటికి భారత ఎన్నికల కమిషన్ వారికి ఇక్కడి సమాచారం తెలిసింది. వెంటనే అలా కానుకలు రూపంలో ఏమీ ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదని శాసించింది. ప్రజలకు ముఖ్యంగా ఓటరుకి పొట్టచెక్కలయ్యేంత నవ్వొచ్చింది.
పార్టీలు గెలవడానికి అన్ని యత్నాలూ చేస్తున్నాయి. వాటిలో భాగమే ఈ కానుకుల సంగతి. కొందరు ఏకంగా బంగారం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారట. అంటే మునుగోడు ఓటరు అనతికాలంలోనే కోటీశ్వరుడు అయినా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎవరు ఏమీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకో వాలని హెచ్చరికలు జారీచేయడం పెద్ద అమాయకత్వం. అధికారంలోకి రావాలి, మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలి, రెండింటిలో ఏదయినాసరే పార్టీలకు ప్రధానమే. అందువల్ల తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి చేయాల్సిన అన్ని పనులూ చేస్తారు, అన్ని మార్గాలను అనుసరిస్తుంటారు. ఇది అనాదిగా ఉన్నదే. కాబోతే, ఇ.సి మాత్రం ఈసారి గట్టి చర్యలు తీసుకోవడానికి నిర్నయించింది. ఎవర యినా సరే డబ్బురూపంలోగాని, వస్తు రూపంలోగాని పార్టీల నుంచి, అభ్యర్ధుల నుంచి తీసుకోరాదు, అది ఘోరనేరంతో సమానమని భారీ ప్రచారానికి పూనుకుంది. పూర్వం సినిమాలకు రిక్షాల ప్రచారంలాగ వాహనాల్లో మైకు ప్రచారానికి, గోడల మీద పోస్టర్ల ప్రచారానికి పూనుకుంది. ప్రాంతీయ భాషలో ఈ ప్రచారం జరగాలని తెలంగాణా అధికారులను ఆదేశించింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్, ఏవిఎంలు సిద్ధమయ్యాయని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు.
మునుగోడు నియోజకవర్గంలో 80 ఏళ్లు నిండిన 345 మంది ఓటర్లు, 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత గడువులోగా ఫారం 12 డి సమర్పించారు. సీనియర్ సిటి జన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి ఈసీఐ సూచనల మేరకు షెడ్యూల్‌ను సిద్ధం చేసి నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు బుక్ చేశామని, 2.5 కోట్లు సీజ్ చేశామని వికాస్ రాజ్ తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,483 లీట ర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, 77కేసులు నమోదుచేసి 36 మందిని అరెస్టు చేశామని చెప్పారు.
మునుగోడుకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుబోధ్ సింగ్‌తో పాటు ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని రెండవ ఎన్నికల పరిశీలకుడిగా ఎన్నికల కమిషన్ నియమించింది. ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) నియోజకవర్గంలోని అక్రమ నగదు ప్రవాహాన్ని నియం త్రించేందుకు వ్యయ పరిశీలకులకు సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ నుండి ఏడుగురు సిబ్బందిని మునుగోడుకు నియమించారు.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ బహుమతులు, చేబదులు రూపంలో పార్టీవర్గాలు ఓటర్లకు ఇచ్చేవాటిని, బహిరంగంగానో, రహస్యంగానో ఇళ్లకు పంపే వస్తువులను ఏ కెమెరా కన్ను అమాంతం పట్టేస్తుంది? రాజుగారికి కోపం వచ్చినా, ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని హెచ్చరికలు చేసినా పార్టీలు, నాయకులు, అభ్యర్ధులు, ఇపుడు ఓటరు కూడా చాలా లైట్ గానే తీసుకుంటున్నారు. దీన్ని అవినీతి అనే కంటే మా వారికి ఇష్టపూర్వకంగా ఇస్తున్న కానుకలు అంటూ పెళ్లిలో ఇచ్చినట్టు ఇస్తున్న పుడు ఓటరు మాత్రం కాదనలేకపోతాడుకదా. లోలోపల కాస్తంత భయం ఉండచ్చుగాక, ఈ తరుణం మించితే ఆనక ఫ్రిజ్ కొనడానికయినా నానా తంటాలు పడాలన్నది ఓటరు ఆలోచన, పోనీలేద్దూ మనకి ఓటు వస్తాడుగా అనే నమ్మకం పార్టీలదీను. ఇక ఇసీ ప్రకటనలు, హెచ్చరికలు గోడ మీద పోస్టర్లే.