ప్రగతి భవన్ కు ఈసీ నోటీసులు
posted on Oct 20, 2023 @ 3:58PM
బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తుంటూ ఔనని అనక తప్పదని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల నుంచి కారును పోలిన ఎన్నికల గుర్తులపై నానా యాగీ చేస్తున్న ఆ పార్టీకి ఇప్పుడిక ఆ విషయంపై నోరెత్తే అవకాశం లేకుండా పోయింది. కారును పోలిన ఎన్నికల గుర్తులను ఏ ఇతర పార్టీకీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరతూ సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్ కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది.
ఇక ప్రగతి భవన్ వేదికగా పార్టీ కార్యకలాపాలూ ఎన్నికల ప్రచార వ్యూహాల రూపకల్పన జరుగుతోందంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ప్రగతి భవన్ కు నోటీసులు పంపింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై స్టేట్ ఎలక్షన్ అధికారి (ఎస్ఈవో) హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకుని ప్రగతి భవన్ లో జరుగుతున్న కార్యకలాపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రగతి భవన్ నిర్వహణాధికారికి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ భవనమైన సీఎం క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ ప్రభుత్వ భవనమనీ, ఆ భవనంలో పార్టీ కార్యక్రమాలు, కార్యక్రమాలు నిషేధమనీ ఆ నోటీసులో పేర్కొంది.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచీ రాష్ట్రంలో ఈసీ ఆదేశాలమేరకు చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన వెంటనే ఈసీ స్పందించడం, ప్రగతి భవన్ కు నోటీసులు పంపించడం చూస్తుంటే ఈ సారి ఎన్నికలలో అధికార దుర్వినియోగం, అక్రమాల వంటి వాటికి తావు లేకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపడుతోందని అవగతమౌతున్నది.
2018 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. చివరాఖరికి ఈవీఎంల విషయంలో, వాటి భద్రత విషయంలో కూడా అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఈ సారి అటువంటి వాటికి తావులేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నదని భావించాల్సి ఉంటుంది. ప్రగతి భవన్ కు నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ స్పందన ఏమిటన్నది చూడాల్సి ఉంది.