అన్నీ పంజరంలో చిలుకలేనా?.. ఖర్గే కుమారుడికి ఈసీ నోటీసులు
posted on May 4, 2023 @ 9:46AM
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ, మోదీపై నాలాయక్ (చేతకాని వ్యక్తి) అంటూ వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో గురువారం (మే 4) సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆ నోటీసులో ఆదేశించింది. ప్రధాని మోదీపై అనుచిత పదజాలం ఉపయోగించారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు ప్రియాక్ ఖర్గేకు ఈసీ నోటీసులు యిచ్చింది.
చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రియాంక్ ఇటీవల ఓఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోడీని నాలాయక్ గా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు. ప్రధానిపై ఎవరు ఏ చిన్న మాట మాట్లాడినా..ఈడీ, సీబీఐ కేసులు పెడుతుంటే.. ఈసీ నోటీసులు యిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు తాజాగా ప్రియాంక్ ఖర్గేకు ఈసీ జారీ చేసిన నోటీసులు మరింత బలం చేకూర్చాయి.
ప్రతిపక్షాలపై బీజేపీ నేతలు యిష్టారీతిన మాట్లాడినా, వారి అనుచిత వ్యాఖ్యలపై విపక్షాలకు చెందిన నేతలు ఫిర్యాదులు చేసినా ఈ సంస్థలు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో సుప్రం కోర్టు సీబీఐని పంజరంలో చిలుక అని వ్యాఖ్యనించిందనీ, యిప్పుడు ఈడీ, ఐటీ ఈసీల తీరుకూడా అలాగే మరినట్లుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే.. సోనియా గాంధీని విషకన్య అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు స్పందించలేదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.