రఘునందన్ రావ్ పై కేసు నమోదు
posted on Apr 3, 2024 @ 12:20PM
గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీచేసి పరాజయం చెందిన రఘునందన్ రావు టార్గెట్ గా బిఆర్ఎస్ పావులు కదుపుతోంది. గత ఎన్నికల ప్రచారంలో దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై రఘునందన్ రావ్ హత్యాయత్నం చేయించినట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుతో భారతీయ జనతాపార్టీ రఘునందన్ రావుకు మెదక్ లోకసభ స్థానం టికెట్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని బిఆర్ఎస్ నేతలు రఘునందన్ రావ్ పై ఏకంగా ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదయింది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.