ఏపీలో ముందస్తు తథ్యం.. వైసీపీ ఎంపి జోస్యం!
posted on Apr 4, 2023 @ 2:09PM
ఆంధ్రప్రదేశ్ లో గడువు మేరకే ఎన్నికలు జరుగుతాయి అంటూ ముఖ్యమంత్రి జగన్ విస్పష్టంగా చెప్పిన మరుసటి రోజే అధికార పార్టీ రెబల్ ఎంపీ ఏపీలో ముందస్తు తథ్యం అని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం చెప్పినదేదీ చేయరనీ, చేసేదేదీ చెప్పరనీ ఆయన ఈ నాలుగేళ్ల పాలనలో పదే పదే రుజువౌతూ వస్తున్న నేపథ్యంలో రఘురామ జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. తన ముఖం చూసే జనం ఓట్లేస్తారనీ, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలు మాత్రమేనని చాటుతూ వచ్చిన జగన్ కు హఠాత్తుగా ఇప్పుడు ఎమ్మెల్యేల వైఫల్యం వల్లే తన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని ఆక్రోశం వ్యక్తం చేయడానికి ప్రజల్లో వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ఆగ్రహమే కారణమని పరిశీలకులు అంటున్నారు.
రఘురామకృష్ణం రాజు సోమవారం హస్తినలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముందస్తు ఎన్నికలు ఈ ఏడాది జరుగుతాయనీ, అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు తీరిగ్గా నాలుగేళ్లు గడిచిన తరువాత ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఉత్సవ విగ్రహాలకూ తేడా లేకుండా పోయిందన్నారు. బటన్ నొక్కాను, అభివృద్ధి పనులన్నీ తానే చేస్తున్నానని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఒక్క సారిగా మాటతప్పి, మడమ తిప్పి తాను బాగా చేస్తున్నా ఎమ్మెల్యేలు పని చేయడం లేదని నిందలు మోపుతున్నారని విమర్శిచారు. తన ముఖమే చూసి ఓట్లు జనం ఓట్లేస్తారంటూ వచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ ఎత్తి చూపడం.. తన పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను గుర్తించడమే కారణమని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవానికి ముందు వరకూ వైనాట్ 175 అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోకుంటే మరోసారి అధికారం కష్టమన్నట్లుగా మాట్లాడుతుండటమే రాష్ట్రంలో వైసీపీకి, జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందనడానికి నిదర్శనమని వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలంతా గడపగడపకూ తిరిగి తీరాల్సిందేనంటున్న జగన్ తాను మాత్రం ప్రజలకు ముఖం చాటేసి పరదాల మాటున ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ పై దాడి ద్వారా మొదలైనవైసీపీ ఉన్మాదం తన పైనుంచి, అచ్చన్న మీదుగా ఇప్పుడు కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ నాయకుల వరకూ వెళ్లిందని రఘురామ అన్నారు. సత్య కుమార్ పై జరిగిన దాడి గురించి కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద వ్యక్తితో తాను మాట్లాడినప్పుడు పిచ్చి పరాకాష్టకు చేరినప్పుడు ఇలాంటి పనులు చేస్తారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారని రఘురామ అన్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సి ఆర్ డి ఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ప్రభుత్వ కడుపు మంట తప్ప మరొటి కాదన్నారు. సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన విజయవంతం అయి, పొత్తులపై ఒక స్పష్టత రావాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు.