మందు బాబులు..సారీ.. కోతులు
posted on Nov 1, 2022 @ 11:52AM
అతిగా తాగి తూలేవాడిని కోతి అనే పిలుస్తారు. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా వాగడం, తిరగడం చేస్తుంటాడు. మరి కోతులే మందు కొడితే? సరిగ్గా ఇదే జరుగుతోంది ఉత్తరప్రదేశ్ లో. రాయిబరేలీలో లిక్కర్ దుకాణాలవారికి, అక్కడికి వచ్చేవారికి కోతుల బెడదతో భయంతో కూడిన సమస్యలు తెలెత్తాయి.
గుడికి వెళితే అరటిపళ్లు లాగేసుకునే కోతులు చూస్తాం. వాటికి భయపడుతూ జాగ్రత్తగా వెళ్లి వస్తుంటారు. వాటికి ఆకలి వేసి జనాల మీద దాడి ప్రారంభించితే ఇంట్లో ఉన్న తిండి అంతా సమర్పించు కోవా ల్సిందే. ఇచ్చేంతవరకూ వదలవు. కానీ మందుబాటిల్, మందు కోసం కూడా ఎగబడటం, జనాన్ని ఇబ్బందిపెట్టడం మాత్రం రాయిబరేలీలో జరుగుతోంది. ఏదో సరదాగా నలుగురు కలిసి తాగదాలని వెళ్లినవారి మీదా కోతులు దాడి చేస్తున్నాయట. వాటికి మందు అంతగా యిష్టమయిందేమో మరి.
మామూలుగా అయితే, బాగా చెట్లు ఉన్న కాలనీల్లోకి దండులా వచ్చి పడుతుంటాయి. మామిడి, అరటి చెట్లున్నచోట మరీ ఎక్కువ గోల చేస్తుంటాయి. పిల్లలతో పాటు దూకుతూ, దొంగతనంగా ఇళ్లలోకి వచ్చి అందిన తిండిపదార్ధాలని తినేస్తుంటాయి. కానీ రాయిబరేలీ కోతులు మరింత చిత్రంగా ఉన్నాయి. అక్కడివారంతా రోజూ వాటివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారట. మొన్నామధ్య ఒకరోజు లిక్కర్ దుకాణం వాడు దుకాణం తలుపు తీసేసరికే లోపల కూచుని ఒకటి డబ్బా బీర్ లాగించేస్తూ కనపడింది. అంతే దుకాణం వాడు గొల్లుమన్నాడు. వెంటనే వాటిని పట్టుకునేవారిని పిలిపించాడు. వాళ్లు వచ్చే లోగానే మరోటి తాగేసి పారిపోయింది. రోడ్డు మీద వెళుతూ ఆయన కేకలు విన్నవారిలో కుర్రాళ్లు ఆ మందుకోతి వీడియో తీశారు. ఇపుడు అది వైరల్ అయింది.