విశాఖ జిల్లా వైసీపీలో కోల్డ్ వార్... మంత్రి అవంతిపై జగన్‌కు ఫిర్యాదులు..!
posted on Oct 4, 2019 @ 11:17AM
విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా గొడవలు రాజుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్న అవంతి... విశాఖ జిల్లాలో ఎవర్నీ లెక్కచేయడం లేదనే మాట వినిపిస్తోంది. జిల్లాలో తానే కింగ్ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని, దాంతో అందరితోనూ గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి గొడవపడ్డారన్న వార్త... వైసీపీలో కలకలం రేపగా, తాజాగా మరో కీలక నేత, వీఎంఆర్‌డీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తో ఏకంగా అందరి ముందే మాటల యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది.
గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో మంత్రి అవంతి... వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. అవంతి ప్రసంగిస్తుండగా, అదే స్టేజ్ పై ద్రోణంరాజు శ్రీనివాస్...కలెక్టర్ తో సంభాషిస్తున్నారు. అయితే, ఇబ్బందిగా ఫీలైన అవంతి... అన్నా శీనన్నా... నగరంలో పెరిగిన మీకు గ్రామీణ కష్టాలు తెలియవు... కొద్దిగా వినండన్నా అంటూ కామెంట్ చేయడంతో, ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. అవంతి మాటలతో నొచ్చుకున్న ద్రోణంరాజు... తాను మాట్లాడుతున్న టైమ్ లో ఘాటుగా బదులిచ్చారు. కుగ్రామంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు రెండు ప్రాంతాల గురించి అవగాహన ఉందని, కానీ ఎక్కడ్నుంచో వలసొచ్చి, ఇక్కడకొచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లకు పల్లెటూళ్ల బాధలు ఏం తెలుస్తాయంటూ అవంతికి గట్టిగా కౌంటరిచ్చారు. అంతేకాదు చిన్నాపెద్దా చూసి మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగుతిన్న అవంతి.... ద్రోణంరాజును బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, ఇదంతా వందల మంది ముందు జరగడంతో వైసీపీ నేతలు షాకయ్యారు.
అయితే, అవంతి వ్యవహార శైలి, విశాఖ జిల్లా వైసీపీలో గొడవలు, నేతల మధ్య కోల్డ్ వార్... జగన్ దృష్టికి వెళ్లడంతో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకుంటే ఎలా అంటూ మందలించారట. ప్రతి ఒక్కరూ విభేదాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టతకు కలిసి పనిచేయాలని, విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.