ట్రంప్ వచ్చాడు.. బ్యాగులు సర్దుకోండి...
posted on Nov 28, 2016 @ 2:02PM
డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింలను దేశంలోకి రానివ్వద్దని.. నేను కనుక ఎన్నికల్లో గెలిస్తే ముస్లింలు అమెరికాలో ప్రవేశించకుండా పూర్తిగా నిషేదం విధిస్తానని చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశమంతటా పెద్ద దుమారమే రేపాయి. ఇక ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్న నేతలు ట్రంప్ కనుక గెలిస్తే దేశం సర్వనాశనమవుతుందని ఆరోపించారు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు కొందరు వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ముస్లింలకు బెదిరింపు లేఖలు రాస్తున్నారు కొంతమంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని వ్యక్తులు ‘ట్రంప్ వచ్చాడు. ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజొచ్చింది. యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో.. ముస్లింల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడు’ అంటూ అమెరికన్స్ ఫర్ ఏ బెటర్ వే పేరిట లేఖలు రాసి శాన్ జోస్, లాంగ్ పనోమాలో గల మసీదులకు పంపించారు. ఈ లేఖల్లో ఉపయోగించిన భాష, ఉపయోగించిన పదాలు బయటకు చెప్పలేనంత దారుణంగా ఉన్నాయి. ట్రంప్ తమ కొత్త రక్షకుడని, ఆయన నిండు జీవితం బతకాలని.. తెలివైన వాళ్లయితే ఇప్పుడే బ్యాగులు సర్దుకుని పారిపోవాలని కూడా హెచ్చరించారు. మరి ఈ లేఖలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.