కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత పోటీ ఫిక్స్.. పార్టీ ఏదంటే?
posted on Mar 4, 2024 @ 11:59AM
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వచ్చే లోక్ సభ ఎన్నికల పోటీ చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టడం ఖాయమని తేలిపోయింది. తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేసి, గుండెపోటు అతి తొలుత నమ్మించడానికి ప్రయత్నించి, అది ఫలించకపోయే సరికి నారాసుర రక్త చరిత్ర అంటూ నెపాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు.
అది కూడా అవాస్తవమని తేలిపోయేసరికి.. తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్షపడేలా చేయడమే లక్ష్యంగా డాక్టర్ సునీత అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె డిమాండ్ మేరకే వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టింది. ఆమె డిమాండ్ మేరకే ఈ హత్య కేసు విచారణను కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటన్నది దాదాపుగా అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. వివేకా హత్య వెనుక సొంత బంధువులే ఉన్నారని ద్యాప్తు సాగుతున్న క్రమంలో డాక్టర్ సునీతకు కూడా స్పష్టత వచ్చింది. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ కు స్వయానా తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల తన చిన్నాన్న వివేక హత్యకు మోటివ్ కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశమేనని కుండ బద్దలు కొట్టేశారు.
వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టినా, కేసు ను ఏపీ నుంచి తెలంగాణకు మార్చినా విచారణను అడుగడుగునా అడ్డుకునే విషయంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
అదలా ఉంచితే.. వైఎస్ వివేకా హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికలలో కూడా వివేకా హత్య అంశం కీలకం కానుంది. అయితే అప్పుడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన ఈ అంశం ఇప్పుడు రివర్స్ లో కీలకంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ సీబీఐ దర్యాప్తు కూడా హంతకులు ఎవరన్నది, హత్య వెనుక కుట్ర ఏమిటన్నది తేల్చలేకపోవడం, అప్పట్లో వివేకా హత్యను తనకు సానుభూతిగా మార్చుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి అండగా నిలవడంతో నాడు సానుభూతి కురిపించిన ఈ అంశం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకత పెల్లుబకేలా చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
సరిగా ఈ తరుణంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకపోవడాన్ని ఆక్షేపిస్తూ... ప్రజామద్దతు, ప్రజా తీర్పు కోరుతూ జనం ముందుకు రావాలని డిసైడైపోయారు. రాజకీయ మద్దతు, అండతో తన తండ్రి హత్య కేసులో పురోగతి లేకుండా నిందితులు రక్షణ పొందుతున్నారని ఆరోపించిన ఆమె ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేసి ప్రజామద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల హస్తిన వేదికగా ఆయన మీడియా సమావేశంలో తన తండ్రి హత్య కేసును ముందుకు జరగకుండా ఆపడంలో తన పెదనాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ఏపీ సీఎం జగన్ ప్రమేయం ఉందని నేరుగా ఆరోపించారు. అటువంటి వ్యక్తికి, ఆయన పార్టీకీ ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపుచర్చారు. ఈ మీడియా సమావేశం ద్వారా తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. తమ కుటుంబంలో వైఎస్ సునీత ఒక్కరే తనకు అండగా నిలిచారని డాక్టర్ సునీత చెప్పారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే డాక్టర్ సునీత ఏ రాజకీయ పార్టీలో చేరతారన్న విషయంలో ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆమె హస్తిన వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో ఆమె కడప్ ఎంపీ అభ్యర్థిగా నిలబడటం ఖాయమని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని వినిపిస్తున్నా, ఒక పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్నీ తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఎందుకంటే వివేకా హత్య కేసు విషయంలో పార్టీలకు అతీతంగా జగన్ పై ఆగ్రహం, సునీతపై సానుభూతి వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.