గులాబి పార్టీలో అసమ్మతి భగ్గు..వలసలకు సిద్ధం.. సిట్టింగులకే సీట్లు ప్రకటనే కారణమా?
posted on Sep 7, 2022 @ 11:27AM
తెలంగాణలో అధికార తెరాసలో ఏం జరుగుతోంది? కేసీఆర్ తీరు దేనికి సంకేతం. పార్టీలో విభేదాలను పరిష్కరించి నేతలంతా సమన్వయంతో పని చేసేలా దిశా నిర్దేశం చేయాల్సిన కేసీఆర్ తన తీరుతో, ప్రకటనలతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లేలా, అసమ్మతి జ్వాలలో అజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సహజంగానే యాంటీ ఇంకంబన్సీని తెరాస ఎదుర్కొంటోంది. ప్రజా వ్యతిరేకతకు తోడు.. 2014 ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చి తెరాస గూటికి చేరిన ఎమ్మెల్యేల కారణంగా పార్టీలో అసమ్మతి పెరిగింది. ఈ మూడేళ్ల కాలంగా అది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నివురు తొలగి నిప్పు బయటకు వస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ దాదాపుగా పార్టీ నేతలలో విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా పెద్దదిగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో విభేదాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావలసిన పార్టీ అధినేత అందుకు భిన్నంగా సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు అంటూ ప్రకటించేసి విభేదాలకు అజ్యం పోసారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
అసలే ఇప్పటికే పార్టీలోని పలు నియోజకవర్గాలలో భగ్గుమంటున్న అసమ్మతి, పార్టీ టికెట్ల కోసం ఇప్పటి నుంచే పోటాపోటీ ఈ నేపథ్యంలో సిట్టింగులకే టికెట్లు అంటూ కేసీఆర్ ప్రకటించి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చి ఉండేదేమో కానీ.. ప్రస్తతం రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ప్రకటన పార్టీలో వలసలను పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో అయితే అధినత వైఖరి పట్ల అసమ్మతి ఉన్నా ప్రత్యామ్నాయం లేక అసమ్మతి వాదులు మిన్నకున్నారు.
పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టినా తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని పంటి బిగువుల అదిమిపెట్టి మౌనం వహించారు. అయితే ఇప్పుడు పరిస్ధితి గతానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అసమ్మతులకు, అసంతృప్తులకు ఇప్పుడు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో గట్టిగా పుంజుకున్నాయన్న అంచనాల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలలోకి వలసలు పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఆయా పార్టీలు తెరాస అసంతృప్తులకు గాలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తెరాసలో ఇప్పటికే ఆసంతృప్తి, అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు పీక్స్ లో ఉంది. వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. పలు నియోజకవర్గాలలో పార్టీలోని ముఖ్య నేతల మధ్యే మాటల యుద్ధం జరుగుతోంది.
ఇక వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రంలో బలపడుతున్నాయి. బీజేపీ తరఫున ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి రాష్ట్రంలో వరుస పర్యటనతో, కేసీఆర్ పై విమర్శలతో రాజకీయ హీట్ పెంచేస్తున్న పరిస్థితి. అదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచీ పార్టీలో సమస్యలను పరిష్కరించుకుని పుంజుకున్న కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో తెరాస అధినేత పార్టీలో సమస్యలను, నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకుని పార్టీని ఏకతాటిపై నడిపించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సిట్టింగ్ లకు టికెట్లు, అదే పార్టీ సంప్రదాయం అని ప్రకటించేయడం ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో వారు అనివార్యంగా పక్క చూపులు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీలు అదికార పార్టీలోని అసంతృప్తులు, అసమ్మతీయులకు గాలం వేస్తున్నాయి. మరో వైపు తెరాసకు చెందిన నేతల కంపెనీలు, ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు. ఇవి సరిపోవన్నట్లు కొత్తగా బీజేపీ తెరపైకి తెచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి వాటితో తెరాస డీలా పడిందన్నది ఖాయం.
ఈ సమయంలో తెరాస అధినేత సిట్టింగులకే సీట్లు అన్న ప్రకటన కచ్చితంగా పార్టీపై ప్రతి కూల ప్రభావం చూపుతుంది. కాగా సిట్టింగులకే టికెట్లు అన్న ప్రకటన ద్వారా కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం చేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి తెలంగాణలో అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్న కాంగ్రెస్-బీజేపీలకు ఆయనే ఆయుధాలు అందించారని అంటున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలున్న నియోజకవర్గాల సంఖ్య, 40 వరకూ ఉంది. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతితోపాటు.. అక్కడ వారి స్థానంలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ క్రమంలో.. సిట్టింగులకు వ్యతిరేకంగా ఇప్పటినుంచే ముఠాలు కట్టి, రోడ్డెక్కుతున్న ఘటనలు పార్టీ పరువు తీస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరిల విషయమే ఇందుకు ఉదాహరణ. ఇరువురూ కూడా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ మంత్రి జగదీష్‌రెడ్డి తనను, కర్నె ప్రభాకర్‌ను తొక్కేయాలని చూస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. ముందు ముందు ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి-మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాండూర్‌లో మహేందర్‌రెడ్డి-రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌లో మెతుకు ఆనంద్-సంజీవరావు, నకిరేకల్‌లో లింగయ్య-వీరేశం, ఆలేరులో సునీతా మహేందర్‌రెడ్డి-సందీప్‌రెడ్డి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.
ఇక వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్‌కు వ్యతిరేక వర్గం ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తోంది. పాలేరు, కొత్తగూడెం, సత్తుపల్లి, డోర్నకల్, రామగుండం, మంథని, చొప్పదండి, వేములవాడ, జగిత్యాల, ముథోల్, బోధ్, నారాయణఖేడ్, కొడంగల్, నాగర్ కర్నూల్, దేవరకద్ర ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పటన్‌చెరు, ఉప్పల్, ఎల్బీనగర్, హుస్సాబాద్, ఉప్పల్, జహీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సీట్ల కోసం సీనియర్లు సిట్టింగులకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ, ఆయా నియోజకవర్గాల్లో సొంత సైన్యం తయారుచేసుకునే పనిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో తప్ప, మిగిలిన జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఇక ఈటల రాజేందర్ గెలిచిన హుజూరాబాద్‌లో అయితే అరడజను మంది నేతలు సీట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగులకే మళ్లీ సీట్లు అంటూ కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగులకు పోటీగా, నియోజకవర్గానికి ముగ్గురు-నలుగురు నేతలు సిద్ధమైన పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.