త్రివేదీ బడ్జెట్..చార్జీల బాదుడు?
posted on Mar 14, 2012 @ 12:12PM
న్యూఢిల్లీ: ఈరోజు ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌పై సర్వతా ఉత్కంఠ నెలకొంది. రైల్వేశాఖ మంత్రి దినేశ్ త్రివేదీ బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. మధ్యంతరం వస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా లేవు. దీనికితోడు ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైల్వేలకు ఆదాయార్జనే ధ్యేయంగా పార్లమెంటరీ కమిటీలు, ప్రణాళికా సంఘం, రైల్వే యూనియన్లు కూడా అన్ని క్లాసుల చార్జీలను పెంచాలని సిఫారసు చేశాయి. మాజీ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ కమిటీ కూడా భద్రత రుసుము పేరిట రూ.5000 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేయడంతోపాటు ప్రయాణికుల టికెట్ల చార్జీలను పెంచాలని కూడా సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో ఈసారి ప్రత్యక్షంగా, పరోక్షంగా వడ్డించేందుకూ రైల్వే మంత్రి త్రివేదీ సిద్ధమయ్యారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈసారి ప్రయాణికుల టికెట్ల చార్జీలను పెంచనున్నారు. ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్న వారిపై భారం మోపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. బడ్జెట్లో ఏసీ టికెట్ల చార్జీలను 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. ఏసీ స్లీపర్ క్లాస్ 10 శాతం, చైర్‌కార్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ విభాగాల్లో 15-20 శాతం, ఫస్ట్‌క్లాస్ ఏసీ విభాగంలో 25 శాతం చార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. బడ్జెట్‌కు ముందే 19 - 30 శాతం వరకు సరుకు, రవాణా ఛార్జీలు పెరిగాయి. రవాణా ఛార్జీల పెంపుతో రూ. 12 నుంచి 30కి పెరిగిన బస్తా సిమెంటు రేటు పెరిగింది. స్టీల్, ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా ఛార్జీల పెంపుతో రూ 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా త్రివేదీ ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త రైల్వే లైన్లను నిర్మించకుండా ఉన్న లైన్లలోనే రైళ్లను పెంచితే.. రద్దీ విపరీతంగా పెరిగిపోతుందని, తద్వారా మళ్లీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి కొత్త రైల్వే మార్గాలు నిర్మించటం అనివార్యమైందని వివరిస్తున్నారు. కానీ, ఇందుకు రైల్వే శాఖ వద్ద నిధులు లేవని, స్థిరాస్తులను అమ్ముకునేందుకు రైల్వేలకు అవకాశం లేదని, ఈ నేపథ్యంలో చార్జీలను పెంచడం ఒక్కటే మార్గమని స్పష్టం చేస్తున్నారు. అయితే, సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులపై భారం పడకుండా ఏసీల్లో ప్రయాణించే ఎగువ తరగతిపైనే భారం వేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిపారు.
మౌలిక సదుపాయాల విస్తరణే ఈసారి రైల్వే శాఖ ధ్యేయం. ఈ మేరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. లక్ష కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కకోద్కర్ కమిటీ సిఫారసు చేసింది. వివిధ రాష్ట్రాల గుండా 3300 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్ ప్రాజెక్టును 2017నాటికి పూర్తి చేయాలని నిశ్చయించారు. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల ప్రధాని మన్మోహన్ కూడా సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్డు రవాణాను పెద్దఎత్తున రైల్వేలకు మళ్లించాలనేది ఆ శాఖ యోచన. ఇక వెయిటింగ్ బాధ లేకుండా కన్‌ఫర్మ్‌డ్ బెర్త్‌ను రిజర్వేషన్ చేసుకోవడానికి వీలుగా సరికొత్త పథకాన్నీ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు రైల్వే బడ్జెట్‌కు మంత్రి త్రివేదీ మంగళవారం తుది మెరుగులు దిద్దారు.
బడ్జెట్‌లో ఢిల్లీ-జైపూర్-జోధ్‌పూర్ కారిడార్‌లో బులెట్ ట్రైన్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉండవచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత పుణె-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌కు దీన్ని అనుసంధానం చేస్తారు. ఇంతకు ముందు రైల్వే బడ్జెట్‌లలాగా ఈ సారి రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లను పెద్దగా ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే రైళ్లలో, స్టేషన్లలో కేటరింగ్ సదుపాయాల మెరుగుదల లాంటి ప్రయాణికుల సదుపాయాలకు సంబంధించి త్రివేది కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇప్పుడున్న టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరచడానికి ‘గ్రీన్ టాయిలెట్ల’ ఉత్పత్తికి సంబంధించి కూడా మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైలు ప్రమాదాలను నిరోధించడానికి సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ పథకాలను కూడా త్రివేది బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడున్న రైలు బోగీల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశపెట్టడానికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది.
కాగా, బడ్జెట్‌లోకొత్తగా రెండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ప్రకటించనున్నారు. వీటిలో ఒకటి కర్నాటకలోని కోలార్‌లో, మరోటి గుజరాత్‌లోని కచ్‌లో ఏర్పాటు చేస్తారు. కాగా, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా తర్వాత అదే పార్టీకి చెందిన త్రివేదీ రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఈ రైలు కూడా పశ్చిమ బెంగాల్ దిశగానే దూసుకుపోతుందా? లేక ఇతర రాష్ట్రాల్లోనూ ఆగుతుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది!!