మునుగోడు ఉప ఎన్నిక.. కేసీఆర్ కాడి వదిలేశారా? బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశారా?
posted on Oct 22, 2022 @ 9:56AM
మునుగోడులో ఏం జరుగుతోంది. ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఆయన ఫోన్ చేసి ఆహ్వానించడం తరువాయి.. గతంలో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన ఇద్దరు ఈఘమేఘాల మీద ప్రగతి భవన్ చేరుకుని గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పార్టీలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనీ, మునుగోడు ఓటమిని సాకుగా చూపి తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారనీ ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అందుకు తగ్గట్టుగానే పార్టీలకు అతీతంగా కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డికి ఓటేయాలంటూ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ సంభాషణ లీక్ కావడం రేవంత్ ఆరోపణలకు బలం చేకూర్చింది. అ ఫోన్ లో తన అన్న వెంకటరెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సమర్ధించారు.
ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు మునుగోడులో ఓటమిని కాంగ్రెస్ ఇప్పుడే అంగీకరించేసినట్లుందని విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లు పార్టీ వీడడం వల్ల తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదనీ, వాళ్లిద్దరూ ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారని వ్యాఖ్యానిస్తోంది. మునుగోడులో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ లో అయితే ఇప్పటికీ మునుగోడులో ఆ పార్టీ వ్యూహాలేమిటి? ఆపరేషన్ ఆకర్ష్ వల్ల మునుగోడులో గెలుపునకు మార్గం సుగమమౌతుందా అంటే ఏమో అన్న సమాధానం పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. మునుగోడులో పార్టీ కాడి విదిలేసిందా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల నాటికి ఉన్న కాన్ఫిడెన్స్ ప్రస్తుతం పార్టీ అధినాయకత్వంలో కనిపించడం లేదని అంటున్నారు. మునిసిపాలిటీకి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున ఇన్ చార్జ్ లుగా నియమించి ప్రచార బాధ్యతలను అప్పగించిన కేసీఆర్ తాను స్వయంగా ఒక గ్రామానికి ఇన్ చార్జిగా ప్రకటించుకున్నా కూడా పార్టీ క్యాడర్ లో కానీ, నాయకులలో కానీ విజయంపై ధీమా వ్యక్తం కావడం లేదు. దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయా అన్న అనుమానం పార్టీలో క్యాడర్ నుంచి లీడర్ వరకూ వ్యక్తమౌతోందని అంటున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ హస్తిన పర్యటన ముందు వరకూ కనిపించిన ధీమా ఆ తరువాత కనిపించడం లేదని అంటున్నారు. కీలకమైన సమయంలో ఇన్ చార్జిలకు బాధ్యత అప్పగించి హస్తిన వెళ్లిన కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను పట్టించుకోకుండా అక్కడే పది రోజులు మకాం వేయడంతో మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ చేతులెత్తేశారా అన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా పార్టీ శ్రేణుల్లో కూడా ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత పార్టీ ప్రచార సరళిపై సమీక్ష చేయాల్సింది పోయి.. మునుగోడుతో సంబంధం లేని వ్యక్తులను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని చేపట్టడంపై క్యాడర్ లో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ ముందే ఊహించేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎంత కష్టపడినా ఫలితం ఉండదన్న అంచనాతోనే.. మునుగోడు ఉప ఎన్నికను వదిలేసి.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారని అంటున్నాయి. మరీ ముఖ్యంగా గట్టి పోటీ ఇస్తే.. అది కాంగ్రెస్ కు ఏదో ఒక మేర ప్రయోజనం చేకూర్చుతుందన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను లైట్ తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద మునుగోడును మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కిక్కిరిసిపోయేలా చేసి కూడా కేసీఆర్ ఉప ఎన్నిక లో విజయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనీ, ఎన్నికకు ముందే కేసీఆర్ ప్రదర్శిస్తున్న ఈ ఉదాశీనతకే.. ఆయన ఇటీవలి డిల్లీ పర్యటనకూ ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కుమార్తెను డిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి ఆయన హస్తినలో బీజేపీ పెద్దలతో ఏదైనా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా అన్న అనుమానాలు పార్టీ క్యాడర్ నుంచే వ్యక్తం అవుతుండటం గమనార్హం. ఏది ఏమైనా వేర్వేరు కారణాలతో మునుగోడు ఉప ఎన్నికలలో పోరును కాంగ్రెస్, ఆఆర్ఎస్ లు మధ్యలోనే ఆపేశారనీ, దీంతో అక్కడ బీజేపీ విజయం నల్లేరుమీద బండినడకగా మారిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సెంటిమెంట్ లను విపరీతంగా నమ్మే కేసీఆర్ గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు వచ్చినా ఆ రెండు ఉప ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలైనప్పటికీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల ముంగిట మళ్లీ పార్టీలోకి వలసలకు తెరతీయడం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంద.