జగన్ దృష్టిలో దేవినేని అవినాష్ కూడా కరివేపాకేనా?
posted on Jan 7, 2024 @ 8:17PM
ఎన్నికల సమయం దగ్గరకొచ్చేసిరికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసలు స్వరూపం బయటపడుతున్నది. వైసీపీ పార్టీ పుట్టాక ఎన్నడూలేని విధంగా ఈసారి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ప్రపంపనలు రేపుతున్నాయి. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఎందుకుంటే ఆయన ఇచ్చిన మాటలు, ప్రకటించిన హామీలు ఇలా అన్నిటికీ నిళ్లొదిలేశారు. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు, ప్రకటించిన హామీలు అన్నిటికీ నీళ్ళొదిలేశారు. గతంలో తన గెలుపునకు సహకరించిన అందరినీ.. ఐ ప్యాక్ సర్వేల పేరు చెప్పి దూరం పెట్టేస్తున్నారు. ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా అభ్యర్థులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. జగన్ ఇప్పుడు ప్రకటించే అభ్యర్థులు గెలవడం, గెలవకపోవడం అన్నిది పక్కన పెడితే.. ప్రస్తుతం ఆయా స్థానాలలో ఉన్న సిట్టింగులకు గెలిచే అవకాశం ఇసుమంతైనా లేదన్న అభిప్రాయానికి జగన్ వచ్చేశారు. మీకు ప్రజాదరణ లేదు.. మీకు టికెట్ ఇచ్చినా గెలవలేరు అని ముఖంమీదే చెప్పేస్తూ వారిని పక్కన పెట్టేయడమో, మరో నియోజకవర్గానికి మార్చేయడమో చేస్తున్నారు.
ఇప్పుడు ప్రకటించే వారు అక్కడ క్యాడర్ కు పరిచయం లేకపోయినా తాను తీసుకున్నదే ఫైనల్ నిర్ణయం అంటూ కనీసం చర్చలకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. గతంలో తాను స్వయంగా హామీలిచ్చిన వారికి సైతం గెలిస్తే అంతకు మించి అవకాశం ఇస్తామని చెప్పాలని బుజ్జగింపులు కోసం తాను నియమించుకున్న కమిటీకి జగన్ సూచిస్తున్నారు. దీంతో ఎన్నో ఆశలతో వైసీపీలోకి వచ్చిన వారు, పార్టీ కోసం ఎంతో శ్రమించి క్యాడర్ ను కాపాడుకున్న వారు జగన్ నిర్ణయాలతో ప్రజల మధ్యకి వచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. ఇప్పుడు దేవినేని అవినాష్ కు కూడా రిక్తహస్తమేనంటున్నారు జగన్.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా బలంగానే ఉన్నారు. గత ఎన్నికలలో ఫ్యాన్ గాలిని తట్టుకొని నిలబడ్డ గద్దెకి రాబోయే ఎన్నికలలో భారీ మెజార్టీ ఖాయంగా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంలో అంతర్గత సమస్యలు కాస్త ఇబ్బందిగా మారాయి. చాలా కాలంగా విజయవాడ ఎంపీ కేశినేని నానీ నుండి గద్దెకి సహకారం అందడం లేదు. ఇప్పుడు కేశినేని నానీ తమ్ముడు కేశినేని చిన్నికి తెలుగుదేశం ఎంపీ సీటు ఇస్తుందనే ప్రచారం జరుగుతుండగా.. కేశినేని నానీ వర్గం గుర్రుగా ఉంది. అయితే ఎమ్మెల్యే గద్దె అంటే సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి కావడంతో మూడో సారి కూడా వరుసగా ఆయన గెలుపు గుర్రం ఎక్కడం ఖాయం అంటున్నారు. దీంతో వైసీపీ ఎలాగైనా ఇక్కడ గద్దెకి చెక్ పెట్టాలని తాపత్రయపడుతున్నది.
ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ కు మొండి చేయి చూపించేందుకు జగన్ సిద్ధమైపోయారంటున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి గుడివాడలో కొడాలి నానీపై పోటీచేసి ఓడిపోయిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ ఆ తరువాత తెలుగుదేశం పార్టీని వీడి వీడి వైసీపీలో చేరారు. దీంతో జగన్ అప్పట్లో అవినాష్ ను విజయవాడ తూర్పు అభ్యర్థిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంటూ వస్తున్న బలమైన కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకును దెబ్బకొట్టేందుకు అదే సామజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ అప్పట్లో ఖాయం చేశారు. అప్పటి నుండి అవినాష్ తూర్పు నియోజకవర్గంలో కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు.
దాదాపు రెండేళ్లుగా అవినాష్ ఇక్కడ పార్టీ కో్సం పని చేస్తూ తన పట్టు పెంచుకుని ఎన్నికలలో పోటీకి సిద్ధమౌతూ వస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేది దేవినేని అవినాషే అన్నట్లుగా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చే సరికి జగన్ అవినాష్ ను పక్కకి నెట్టేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భానును తూర్పు నియోజకవర్గానికి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
జగ్గయ్య పేటలో ఉన్న సామినేనిని ఇక్కడకు తీసుకువచ్చి.. అవినాష్‌ను వేరే నియోజకవర్గానికి పంపించడమో, లేదా ఈ సారికి పార్టీ టికెట్ నిరాకరించడమో జరుగుతుందని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది ఒకవేళ సామినేని విజయవాడ తూర్పుకు వచ్చేందుకు అంగీకరించని పక్షంలో యలమంచిలి రవిని ఇక్కడకి తీసుకు వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎలా చూసుకున్నా అవినాష్ కు మాత్రం జగన్ హ్యాండ్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. దీంతో ఎన్నో ఆశలతో నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసిన అవినాష్ కూడా వైసీపీ కూరలో కరివేపాకేనా అని ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.