ఢిల్లీ ఎల్జీ మళ్లీ కిరికిరి
posted on May 20, 2023 @ 9:38AM
అధికారుల బదిలీ, పోస్టింగులు సహా సేవా వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి గత వారం సుప్రీంకోర్టు కార్యనిర్వాహక అధికారం ఇచ్చింది. అయితే.. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా.. ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను తగ్గించాలనే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తో కలసి కేంద్రం కుట్ర చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ సర్వీసెస్ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భరద్వాజ్ కూడా కేంద్రంపై ఆరోపణలు చేశారు. సేవల కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీకి సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేయడానికి.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశానికి హాజరు కావాలని తన క్యాబినెట్ సహచరులందరినీ కోరారు.
కోర్టు ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు పాటించడం లేదు. రెండు రోజులుగా సేవా కార్యదర్శి ఫైల్స్ పై ఎందుకు సంతకం చేయలేదు? వచ్చేవారం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా.. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం తిప్పికొట్టబోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా, అందుకే ఫైలుపై సంతకం చేయలేదా అనే అనుమానం వ్యక్తం చేస్తూ కేజీవాల్ ట్వీట్ చేశారు.
సర్వీసెస్ సెక్రటరీని మార్చే ఫైల్ను తొక్కిపెట్టడం ద్వారా ఎల్బీ సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కోర్టు తీర్పును అమలు చేయకుండా ఉండే కుట్ర జరుగుతోందన్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పదవి చేపట్టినప్పటి నుంచి.. వీకే సక్సేనా.. కేజ్రివాల్ ప్రభుత్వాన్ని ఏదో వంకతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. పాలనాపరమైన అధికం ఇక నుంచి ఢిల్లీ సర్కార్ దే అని గత వారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఆ ఆదేశాలను బేఖతారు చేస్తూ.. ఢిల్లీ ఆప్ సర్కార్ కుమళ్లీ ఊపిరి ఆడకుండా చేయడం ఏమిటి, ఇది పూర్తిగా కేంద్రం డైరెక్షన్ లోనే జరుగుతోందని కేజ్రివాల్ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరో వైపు ఢిల్లీ మంత్రి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ, బెదరిస్తున్నారనీ ఎల్జీ సక్సేనా కేజ్రీవాల్ కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.