పనికిమాలిన నిర్ణయాలకి దారితీసే - Decision Fatigue...
posted on Oct 8, 2018 @ 12:53PM
దసరా వచ్చేసింది. షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు రకరకాల ఆఫర్లతో మోతెక్కించేస్తున్నాయి. 5 శాతం నుంచి 95 శాతం డిస్కౌంటు వరకు నానారకాల వస్తువులూ మీకు అందుబాటులో ఉంటాయని ఊరించేస్తున్నాయి. వినడానికి చాలా బాగుంది కదూ! ఏదన్నా వస్తువు కొనాలంటే చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి కదూ! కానీ మనమంతా ఇక్కడే తప్పు చేస్తుంటాం అని హెచ్చరిస్తున్నారు సైకాలజిస్టులు. అదేంటో మీరే చూడండి!
శరీరంలో ఇతర భాగాల్లాగా మన మెదడు కూడా ఒక అవయవమే! దానికి కూడా అలసట ఉంటుంది. ఎంత మంచి పుస్తకం అయినా, నిరంతరం చదువుతూ ఉంటే అలసిపోతాం; ఎంత గొప్ప సంగీతం అయినా, నిరంతరం వింటూ ఉంటే అలసిపోతాం... అలాగే నిరంతరం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా అలసిపోతామని అంటున్నారు. దీనికి Decision Fatigue అని పేరు పెట్టారు.
Decision Fatigueకి మన రోజువారీ జీవితంలో చాలా ఉదాహరణలే దొరుకుతాయి. ఉదాహరణకి ఓ సూపర్ మార్కెట్‌కే వెళ్లామనుకోండి. అక్కడ కంటి ముందు చాలా వస్తువులు ఊరిస్తూ కనిపిస్తాయి. ఇంతకుముందు మనం చూడనివో, చవకగా దొరికేవో, వైవిధ్యంగా ఉండేవో... తమని కొనమంటూ ఆహ్వానిస్తుంటాయి. మనమేమో ఆ వస్తువుని కొనాలా వద్దా అన్న ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతుంటాం. ఇలా ప్రతీ అర దగ్గరా మన మనసులో ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంటుంది. చివరికి! చివరికి ఆ సూపర్ మార్కెట్లోంచి బయటకు వచ్చేసరికి మన చేతుల్లో పనికిమాలిన వస్తువులు చాలానే చేరతాయి. మార్కెట్లో అడుగుపెట్టిన కాసేపటికి నిర్ణయాలు తీసుకునే విచక్షణ ‘అలసిపోవడమే’ ఇందుకు కారణం.
Decision Fatigue కేవలం వస్తువుల కొనుగోళ్లలో మాత్రమే కాదు... జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఎదురుపడుతుంది. ఉదాహరణకు న్యాయస్థానాలనే తీసుకోండి. పాపం అక్కడి న్యాయమూర్తులు పొద్దున లేచిన దగ్గర్నుంచీ బుర్ర వేడెక్కించేసే అనేక కేసులను వినాల్సి వస్తుంది. దాంతో ఒకో కేసు గడిచేకొద్దీ వారు ప్రతికూల నిర్ణయాలను తీసుకుంటారని తేలింది. ఒక అంచనా ప్రకారం మొట్టమొదటి కేసులో చాలా సానుకూలమైన తీర్పునిచ్చే న్యాయమూర్తులు రానురానూ ఒకో మెట్టూ కిందకి దిగుతూ... ఒకానొక సందర్భంలో 65 శాతం ప్రతికూలమైన తీర్పునే ఇచ్చేందుకు సిద్ధపడిపోతారట.
కేవలం వినియోగదారులు, న్యాయమూర్తులే కాదు... గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల పట్ల విచిత్రంగా ప్రవర్తించడం, సినిమాతారలు తమ వ్యక్తిగత జీవితాలను ధ్వంసం చేసుకోవడం లాంటి సందర్భాలలో ఈ Decision Fatigue చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ఇంతకీ ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం ఎలాగ అనేదానికి కూడా నిపుణులు కొన్ని సూచనలు అందచేస్తున్నారు. అవేమిటంటే…
- మీ ఎంపిక ఏమిటన్నది ముందుగానే కట్టుబడి ఉండండి. ఆ లక్ష్యం త్వరగా చెదిరిపోనివ్వద్దు. కాఫీ పొడి కొనడానికి షాపులోకి అడుగుపెడితే... కాఫీ పొడి మీదే మీ ధ్యాస ఉండనివ్వండి.
- నిర్ణయాలు తీసుకునే అవసరం మరీ ఎక్కువగా ఉన్నప్పుడ కాసేపు విరామం తీసుకోవడం వల్ల మెదడుకి ఉపశమనంగా ఉంటుంది.
- చిన్నచిన్న విషయాలకు ‘అదా ఇదా అదా ఇదా’ అంటూ తాత్సారం చేయడం వల్ల బుర్ర వేడెక్కిపోతుంది. ఏ చొక్కా వేసుకోవాలి, ఏ పెన్ను పెట్టుకోవాలి... లాంటి ఎంపికలను త్వరత్వరగా చేసెయ్యాలి.
- అధిక ప్రాధాన్యత ఉన్న నిర్ణయాలను ఉదయాన్నే తీసుకోండి. ఆ సమయంలో మన మనసు ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఉంటుంది.
- ఎంపికలు పెరిగేకొద్దీ, అయోమయం కూడా పెరిగిపోతుంది. అందుకని ముందు ఎంపికలను అదుపు చేసుకోండి. టీవీ కొనాలి అనుకుంటే దాని పరిణామం ఎంత ఉండాలి? ఖరీదు ఎంతలో ఉండాలి? లాంటి విషయాల మీద ముందుగానే ఒక అవగాహను రావాలి.
- నిర్ణయాలు తీసుకునే సమయంలో విపరీతమైన శబ్దాలు, ట్రాఫిక్, నిద్రమత్తు, మద్యం... లాంటివన్నీ మన మనసుని చికాకుపరుస్తాయి. కాబట్టి ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి.
- ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవడం గొప్పేమీ కాదు. ఎంత మంచి నిర్ణయమైనా, కట్టుబడి ఉంటేనే దానికి విలువ. కాబట్టి మీ నిర్ణయాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండే స్వభావాన్ని అలవర్చుకోండి.
- నిర్జర.