అమ్మాయిల ఫోటోలతో డాక్టర్‌కి....14 కోట్లు కుచ్చుటోపి
posted on Dec 20, 2025 @ 6:45PM
సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటన కలకలం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ని టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు ముందుగా అందమైన యువతి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కంబోడియా నుంచి ఈ మోసానికి పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు.
ఫేస్‌బుక్‌లో ముందుగా ఓ మహిళ పేరుతో నకిలీ ఖాతా ద్వారా డాక్టర్‌కు మెసేజ్ పంపించారు. అందమైన అమ్మాయి దీంతో డాక్టర్ ఆమెతో స్నేహం చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. తాను ఒంటరి మహిళనని, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్న ఆ మహిళ, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో తమ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించింది.
ఆ మహిళ మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టగా, లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మరింత డబ్బు పెట్టేలా ప్రోత్సహించారు. చివరకు ఆమె చెప్పిన మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ తన ఇల్లును కూడా అమ్మి మొత్తం రూ.14 కోట్లు పెట్టుబడిగా జమ చేశారు. అయితే ఆ తర్వాత అకౌంట్లలో నుంచి డబ్బు మాయమవ్వడంతో మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ మోసానికి కంబోడియాలో తిష్ట వేసిన చైనీస్ సైబర్ నేరగాళ్లే ప్రధాన కారణమని గుర్తించారు. కంబోడియా నుంచే ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు ఉపయోగించి డాక్టర్‌ను ట్రాప్ చేసినట్లు తేల్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాలుగు మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అకౌంట్లలోకి డాక్టర్ పంపిన డబ్బును జమ చేసి, వివిధ మార్గాల ద్వారా కంబోడియాకు తరలించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.... “చైనీస్ సైబర్ గ్యాంగ్‌లు కంబోడియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, భారత్ నుంచి యువకులను ఉద్యోగాల పేరుతో అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. మన దేశానికి చెందిన వారినే ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతు న్నారని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులు సూచించే యాప్‌లు, లింక్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టవద్దని సైబర్ అధికారులు ప్రజలను హెచ్చరించారు. మోసపో యిన లేదంటే ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.