కోవిడ్ ఇక ఎండమిక్.. అయినా జాగ్రత్తలు తప్పని సరి!
posted on Jul 12, 2022 @ 3:30PM
కోవిడ్ ఇంక ఎంత మాత్రం పెండమిక్ కాదని, అది ఎండమిక్ స్టేజికి చేరుకుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. గత ఆరు వారాలుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందనీ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ ఎండమిక్ దశకు చేరుకుందని,
కొవిడ్ కూడా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయిందని ఆయన వివరించారు. ఒక వేళ ఎవరిలోనైనా కోవిడ్ లక్షణాలు ఉంటే 5 రోజులు క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేద స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదన్నారు.
కొవిడ్ సోకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలన్నారు. ప్రస్తుతం భారీవర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఆహారం, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన బ్యాక్టిరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని.. వర్షాలు పడే సమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.