భారతీయులందరికి గొప్ప శుభవార్త.. డిసెంబర్ 25 నుండి వ్యాక్సిన్ పంపిణి షురూ
posted on Dec 9, 2020 9:28AM
భారతదేశం మొత్తం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. గత 9 నెలలుగా దేశం లోని ప్రతి ఒక్కరిని భయ పెడుతున్న కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ ఈ డిసెంబర్ 25 నుండి భారత్ లో అందుబాటులోకి రానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినమైన డిసెంబర్ 25న భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు కానుంది. భారత ప్రధాని మోడీ స్వయంగా టీకా పంపిణీని ప్రారంభిస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ తెలియజేసింది. తొలిదశ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 20 రోజుల వ్యవధిలో.. అంటే, జనవరి 15 నాటికి కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత నుండి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు.
వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే "కోవిన్" పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు కాగా.. దీనికి సంబంధించి లైవ్ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొవిడ్ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్రాల అధికారులకు సూచించింది. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో టీకాలు ఎలా అందించాలనే విషయాన్నివివరించింది. ఈ సాఫ్ట్ వేర్ లో పేరు నమోదైతేనే వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు తరువాత కనీసం అరగంట పాటు అక్కడే ఉండాలని, వారికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ లేకుంటేనే ఇంటికి వెళ్లాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేసారు. ఇక ఈ "కోవిన్" సాఫ్ట్ వేర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆధార్ కార్డు నంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను వైద్య బృందం తనిఖీ చేస్తుందని, ఆపై వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి గుర్తింపు కార్డు చూపి టీకాను తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ తీసుకున్న వారి మొబైల్ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుందని, ఆపై మూడు వారాల తరువాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన తేదీ గురించిన సమాచారాన్ని పంపుతామని, అంతేకాకుండా రెండు డోస్ లను తీసుకున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక ధ్రువపత్రం అందుతుందని తెలియజేశారు. ఇక వ్యాక్సిన్ కేంద్రంలో స్పాట్ రిజిస్ట్రేషన్ కు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మొదట ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకున్నారో మూడు వారాల తర్వాత అదే కంపెనీ వ్యాక్సిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఒక కంపెనీ టీకా, రెండోసారి మరో కంపెనీ టీకా తీసుకుంటామంటే మాత్రం కుదరదు. ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్ మైనస్ 2, మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉండేదే వస్తుందని అధికారులు చెబుతున్నారు
ఇదిలావుండగా, ఇప్పటికే డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వద్ద మూడు వ్యాక్సిన్ సంస్థలు అత్యవసర అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సమావేశం కానున్న నిపుణుల కమిటీ ఈ మూడింటిపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తొలి దశలో మొత్తం మూడు కోట్ల డోస్ ల వ్యాక్సిన్లను నిల్వ చేసేలా ఎక్కడికక్కడ ఫ్రీజర్ బాక్స్ లను సిద్ధం చేసారు. మరోపక్క 80 దేశాల రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణలో ఉన్న భారత బయోటెక్, ఇ-బయోలజికల్ లిమిటెడ్‌లో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసే పరిశోధన కేంద్రాలను ఈరోజు సందర్శించనున్నారని.. తిరిగి వెళ్లే ముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న హైదరాబాద్ ఎయిర్ కార్గో కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. గ్లోబల్ రవాణాకు వీలుగా ఎన్నో సదుపాయాలు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు కార్గోలో ఉన్నాయని వెల్లడించాయి. అటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా వ్యాక్సిన్ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.