పెళ్లిళ్లు కూడా ఇక ప్రభుత్వ అనుమతితో చేసుకోవాలేమో...
posted on Apr 29, 2020 @ 11:07AM
* కరోనా పాఠాలు మన లైఫ్ స్టైల్ నే మార్చేస్తున్నాయి
* మాస్కులు, శానిటైజర్లు విందుల్లో, పండుగల్లో, మార్కెట్లలో, మాల్స్ లో ఇహ తప్పనిసరి
ఎయిడ్స్ వచ్చిన తొలినాళ్ళలో జనం భయంతో వణికి పోయారు. సెక్స్ ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ఇంజక్షన్ ద్వారా, రక్తం ఎక్కించుకోవడం ద్వారా, గడ్డం గీసుకుని బ్లేడు ద్వారా కూడా సంక్రమిస్తుందని తెలిసి భయబ్రాంతులకు గురయ్యారు.ఇప్పుడు ఈ భయంకర ఎయిడ్స్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండడానికి అలవాటుపడిపోయాం. ఆ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకున్నాం. డిస్పోజబుల్ సూదులు (ఇంజక్షన్ల కోసం) వచ్చాయి. బార్బర్ షాపుల్లో బ్లేడు వాడకంలో జాగ్రత్త పడ్డాం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాం.
ఇప్పుడు కరోనా కూడా అలాగే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మాస్కు, శానిటైజర్లు జేబుల్లో పెట్టుకుని తిరగాల్సి రావచ్చు.ఇక వివాహాలు, విందులు ప్రభుత్వ అనుమతితో జరుపుకోవాల్సి వస్తుందేమో! స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు ఇచ్చి ఆ తర్వాత పెళ్ళో, గృహ ప్రవేశమో, చావో, వర్దంతో, మరింకోటో ఏర్పాటు చేసుకోవాల్సి రావచ్చు.పదిమంది కూడాల్సిన చోట అనుమతి తప్పనిసరి కావచ్చు. అలాగే ఈ మాస్కులు, శానిటైజర్లు విందుల్లో, పండుగల్లో, మార్కెట్లలో, మాల్స్ లో తప్పనిసరి అవుతాయేమో!