తెలంగాణలో కరోనా మరణాలు ఎన్ని! దాస్తున్నవి ఎన్ని !
posted on Apr 3, 2021 @ 10:01PM
తెలంగాణలో రెండోదశ కొవిడ్ రోజురోజుకూ పంజా విసురుతోంది. తొలిదశ కంటే రెండోదశలో అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే కరోనా కేసులపై రాష్ట్ర వైద్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భారీగా కేసులు వస్తున్నా... అధికారులు దాచిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా విడుదల చేస్తున్న రిపోర్టులలో ఎక్కువ కేసులు వస్తుండగా.. రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నది మాత్రం తక్కువగా ఉంటోంది. శనివారం వెయి 38 కేసులు వచ్చినట్లు అధికారిక బులిటెన్ విడుదలైంది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం 15 వందలకు పైగానే కరోనా కేసులు వచ్చాయంటున్నారు.
కరోనా మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకూ కరోనా మృతులు పెరిగిపోతున్నారు. గురువారం 17 మంది చనిపోగా శుక్రవారం 22 మంది కన్నుమూశారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ మరణాలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. మృతుల్లో అయిదేళ్ల బాలుడి నుంచి 29 ఏళ్ల యువకుడు, 90 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. గత ఏడాది కొవిడ్ ఉద్ధృతంగా ఉన్నప్పుడూ ఒక్క రోజులో ఇంతమంది చనిపోలేదని వైద్యులు అంటున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కొవిడ్ సమాచారంలో మృతుల సంఖ్య నాలుగుకు మించడం లేదు. ఇతరవ్యాధులు ఉండి మరణించిన వారిని ఈ లెక్కలో చూపడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనాతో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. మరో అంశం మాత్రం కలవరం రేపుతోంది. ఆసుపత్రుల్లో చేరికలు మొత్తంగా తక్కువే ఉన్నా.. చేరుతున్నవారిలో మాత్రం అత్యధికులు ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 115 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 255 మంది, ప్రైవేటులో 764 మంది ఐసీయూలో వెంటిలేటర్ చికిత్సల్లో ఉన్నారు. ఈ లెక్కన ఆసుపత్రుల్లో వెయ్యి మందికి పైగా వెంటిలేటర్ చికిత్సలు అవసరమైంది. తొలిదశతో పోల్చితే ఈ తరహాలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నవారు అధికంగానే ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులతో పోల్చితే ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో పడకలు నిండిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా ఐసీయూ పడకల్లో రోగులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో 25-40 ఏళ్ల లోపు వారు కూడా దాదాపు 40 శాతానికి పైగానే ఉన్నట్లుగా వైద్యనిపుణులు చెబుతున్నారు. లక్షణాలు సోకినా 7-10 రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జలుబు, దగ్గు, జ్వరం పెరుగుతున్నా ఇంటి వద్దనే చికిత్స పొందడం వంటి కారణాలతో ఆరోగ్యం విషమిస్తుండగా, ఆ తర్వాత ఆసుపత్రులకు తీసుకొస్తున్నట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒక్కసారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తీవ్రరూపం దాల్చిన తర్వాత త్వరితగతిన వీరి ఆరోగ్యం విషమిస్తోంది. ఫలితంగా యుక్తవయస్కుల్లోనూ కొవిడ్ మృతులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కొవిడ్ సోకినా, లక్షణాలు కనిపిస్తున్నా చికిత్సకు జాప్యం చేసినవారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా ఉంటున్నారని, వీరు మరింత త్వరగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐసీయూలో విషమ స్థితికి చేరుకున్నవారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయని, రక్తనాళాల్లో గడ్డ కట్టడం, గుండెపోటు, పక్షవాతం వంటివి ఎదురవడం, కంటి చూపు దెబ్బతినడం వంటివి కూడా ఉన్నట్లు వివరిస్తున్నారు. వైరస్ బాధితుల్లో ఎక్కువమందిలో పెద్దగా లక్షణాలు లేకపోయినా.. కొందరిలో మాత్రం తీవ్రంగా విరుచుకుపడడానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరముందని, వైరస్ రూపుమార్చుకొని కొత్తరకం ఏదైనా వ్యాప్తి చెందుతుందేమోననే అంశంపై పరిశోధనలు జరగాలని నిపుణులు చెబుతున్నారు.