మరింత ట్రాప్‌లో కేసీఆర్! అందరి'బంధు'వయ్యేనా? పులిమీద స్వారీ!
posted on Aug 25, 2021 @ 12:49PM
పులి మీద స్వారీ. దళిత బంధుతో సీఎం కేసీఆర్ పులి మీద స్వారీ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి చేసిన కామెంట్లు అక్షరసత్యం అంటున్నారు. ఇప్పటికే ధనికరాష్ట్రం దివాళా అంచునకు చేరింది. జీతాలకు కటకట ఏర్పడింది. తెలంగాణలో ఒక్కొక్కరి నెత్తిపై లక్షకు పైగా అప్పు ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసమంటూ ఉన్నదంతా ఊడ్చేశారు. డబ్బులు లేక డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అటకెక్కించేశారు. నిరుద్యోగ భృతి అమలు చేసే ధైర్యం రావడం లేదు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ భూములు తెగనమ్ముకుంటోంది కేసీఆర్ సర్కారు. ఇంతటి దయనీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఈటల రాజేందర్ భయానికి హడావుడిగా దళితబంధును ప్రకటించేశారని అంటున్నారు. ముందు నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే అన్నారు. ఆ తర్వాత దళితులందరికీ అని ప్రకటించేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం హుజురాబాద్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారు. వేలది కుటుంబాలకు 10 లక్షల చొప్పున దళితబంధు పంచేందుకు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. ఒక్క హుజురాబాద్‌కే 2000 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చేశారు. ఆ డబ్బులే ఒకేసారి ఇవ్వలేక.. అప్పుడింత అప్పుడింత చొప్పున.. దఫదఫాలుగా జమ చేస్తున్నారు. ఆ డబ్బులూ లబ్దిదారులకు ఇచ్చేది లేదు. ఏవేవో సాకులు చెబుతూ.. హుజురాబాద్ ఎన్నిక ముగిసేదాక కాలయాపన చేసేలా కనిపిస్తోంది సర్కారు.
ఒక్క హుజురాబాద్‌లో దళితబంధు అమలుకే కేసీఆర్ సర్కారు ఇంతలా సతమతమవుతుంటే.. ఇక రాష్ట్రమంతా దళితులకు ఆర్థిక సాయం చేయాలంటే ఇంకెంత కష్టం? ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. లక్షా 70వేల కోట్లు అవసరమవుతాయని సీఎం కేసీఆరే చెప్పారు. ఏటేటా 40వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో దళితులందరికీ దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. మాటలైతే చెప్పారు కానీ, దాని అమలుపై తెలంగాణలో ఎవరికీ నమ్మకం లేదంటున్నారు. దళితబంధునే ఇంత కష్టమైతే.. భవిష్యత్తులో బీసీ బంధు, మైనార్టీ బంధు, అగ్రవర్ణ పేదలబంధు.. ఇస్తామంటూ కేసీఆర్ చెప్పడం రాజకీయ ఎత్తగడ మినహా మరేమీ కాదనే విమర్శ వినిపిస్తోంది. చెప్పింది చెప్పినట్టు చేస్తే.. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే.. దళిత బంధు కంప్లీట్ చేయడానికే నాలుగేళ్లకు పైగా సమయం పడుతుంది. ఇక మిగతా వర్గాలకూ ఆర్థిక సాయం ఇప్పట్లో అయ్యే పనేనా అంటున్నారు.
ఖాళీ ఖజానాను ఎంత ఊడ్చినా జీతాలకే సరిపోవడం లేదు.. ఉన్న భూములూ అమ్మేస్తున్నా.. మిగతా సంక్షేమ పథకాలకు సర్దుబాటు చేయడమే చానా కష్టమైపోతోంది. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట సమయంలో ఏళ్ల తరబడి దళితబంధు అమలు చేయడం మాటలు చెప్పినంత సులువు కానేకాదు. అలాంటిది.. దళితులతో పాటు బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకూ బంధు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్పడం రాజకీయ ప్రయోజనాల కోసమేనంటున్నారు. దళితబంధు ప్రకటన తర్వాత మిగతా వర్గాల నుంచి తమకూ బంధు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. వారికి 10 లక్షలు ఇస్తే.. మాకూ ఇవ్వాల్సిందేనని కులాల వారీగా కుంపటి రాజుకుంది. ఈ పరిణామాన్ని సీఎం కేసీఆర్ అస్సలు ఊహించి ఉండకపోవచ్చు. దళితబంధు వల్ల కలిగే రాజకీయ ప్రయోజనం కంటే.. మిగతా వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడే ఎక్కువగా ఉంది. వారందరికీ 10 లక్షల సాయం చేయలేరు.. అలాగని దళితులకు మాత్రమే బంధు అంటే.. మిగిలిన వర్గాలు ప్రభుత్వానికి దూరమవ్వడం ఖాయం. అందుకే, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అందరినీ బంధు అంటూ మాటల గారడీ చేశారని అంటున్నారు. ఆయా వర్గాలను మాటలతో మోసం చేయడమేనంటూ విమర్శిస్తున్నారు. కేసీఆర్ మాటలను నమ్మే వారెవరూ తెలంగాణలో లేరంటూ మండిపడుతున్నారు.