ఈ లక్షణాలు వుంటే గుండె పరీక్ష చేయించుకోవాలి.. లేకపోతే ప్రాణాలకు ముప్పే

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బు ఒకటి. గణాంకాల ప్రకారం కరోనరీ హార్ట్ డిసీజ్ (CAD) అనేది గుండె జబ్బులలో అత్యంత సాధారణ సమస్య. ఇది 2021లో 3.75 లక్షలకు పైగా మరణాలకు కారణమైంది. 20, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి  20మందిలో ఒకరు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం గణనీయంగా ఉంది.  దురదృష్టవశాత్తు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఈ సమస్య ఎదురైన మొదట్లో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లాలంటే భయపడతున్నారు, సమస్య ఏమీ లేదులే అనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా  సకాలంలో రోగనిర్ధారణ  జరగడం లేదు. అదే సకాలంలో సమస్య నిర్థారణ జరిగితే  తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, రోగి ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇదివరకే  గుండె జబ్బులు లేకపోయినా, ప్రతి ఒక్కరూ తమ గుండెను సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష చేయించుకోవడం నేటికాలపు పరిస్థితులలో మంచిదని వైద్యులు చెబుతున్నారు.

యువతలో గుండె జబ్బుల సమస్య..

యువతలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఇందులో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్,  అధిక రక్తపోటు ప్రధానమైనవి. అమెరికన్లలో గుండె జబ్బుల బారిన పడుతున్నవారిలో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  ధూమపానం మొదలయిన వాటిలో కనీసం ఒకదానిని అయినా అలవాటుగా  కలిగి ఉన్నారు. గుండెలో సమస్య ఉండవచ్చని సూచించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎదురైన మరుక్షణమే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

తరచుగా ఊపిరి ఆడకపోవడం..

 తరచుగా శ్వాస ఆడకపోవడాన్ని ఎదుర్కుంటున్నట్టైతే  అది గుండె సమస్యకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను వైద్యపరంగా డిస్ప్నియా అంటారు. ఈ  పరిస్థితి తీవ్రమైన సమస్యగా  పరిగణించబడుతుంది, ఈ సమస్య ఎదురైనప్పుడు  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.  గుండె సంబంధిత, శ్వాసకోశ సమస్యలు తరచుగా ఇంటి పనులు చేయడం,  మెట్లు ఎక్కడం వంటి పరిస్థితుల వల్ల  తీవ్రమవుతాయి.

ఛాతీ నొప్పి..

ఛాతీ నొప్పి కూడా  గుండెలో సమస్య ఉండవచ్చని చెప్పడానికి  ప్రధాన సంకేతంగా పరిగణింపబడుతుంది. పదేపదే  వచ్చే ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ నొప్పిని పెయిన్ కిల్లర్లు ఇతర  మందులతో అణిచివేసేందుకు ప్రయత్నించకూడదు. కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు తరచుగా పెరిగిన వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగులే తరచుగా శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇటువంటి లక్షణాలను తేలికగా తీసుకోవడంలో పొరపాటు చేయకూడదు.

ఒకే తరహా జీవనశైలి..

ఒకే తరహా  జీవనశైలి లేదా  రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండాల్సి వస్తుంటే  అలాంటి సమయాల్లో  జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండెకు హాని కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తపర్సరణ వ్యవస్థ మందగిస్తుంది.ఇలాంటి వారు  గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఈ ప్రమాదం  దుష్ప్రభావాలు దరిచేరకుండా ఉండేందుకు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.

                                                                   *నిశ్శబ్ద.