అంబులెన్స్ ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. శభాష్ బాబ్జి అంటున్న జనం
posted on Nov 5, 2020 @ 11:42AM
పోలీసులంటే లాఠీ ఊపుకుంటూ జనాన్ని భయపెట్టే వాళ్ళే కాదు.. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి అండగా నిలబడేవాడు కూడా అని నిరూపించాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో బాబ్జి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న సాయంత్రం విపరీతమైన రద్దీగా ఉండే అబిడ్స్ సర్కిల్ వద్ద డ్యూటీలో ఉన్నాడు. సాయంత్రం కావడంతో పాటు కార్యాలయాలు వదిలే సమయం కూడా అవడంతో రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది. అబిడ్స్ చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వెళ్లే మార్గం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ సైరన్ విన్నాడు బాబ్జి. దాంట్లో ఒక రోగి ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆ అంబులెన్స్ వద్దకు చేరుకుని తన వెనుకే రమ్మని డ్రైవర్‌కు చెప్పి అక్కడ అడ్డుగా ఉన్న వాహనదారులను "తప్పుకోండి.. తప్పుకోండి.." అంటూ అంబులెన్స్ ముందు పరుగులు తీశాడు. తన ముందున్న వాహనాలను క్లియర్ చేస్తూ అంబులెన్స్‌కు వెళ్లేందుకు దారి ఏర్పరిచాడు. అలా అబిడ్స్ బిగ్ బజార్ నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్ వరకు పరుగులు తీస్తూ అంబులెన్స్ గమ్యం చేరేందుకు సహాయపడ్డాడు. అయితే ఈ దృశ్యాన్ని అంబులెన్స్‌లోని రోగి బంధువులు తమ మొబైల్ లో వీడియో తీశారు. ఆ అంబులెన్స్ లోని రోగి సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే కానిస్టేబుల్ బాబ్జి చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియోను రోగి బంధువులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో అటు నెటిజన్లు. ఇటు పొలిసు ఉన్నతాధికారులు కూడా బాబ్జీని అభినందిస్తున్నారు.