కేసీఆర్ ఫాంహౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య...
posted on Oct 16, 2019 @ 5:04PM
కేసీఆర్ ఫాంహౌస్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పన్నెండవ బెటాలియన్ కి చెందిన వ్యక్తి. నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేశ్వరుల ఆత్మహత్యకు పై ఆధికారుల వేదింపులని ఒక రకం ప్రచారం జరుగుతుంటే కుటుంబంలో ఇబ్బందుల వల్ల అని కూడా మరో వైపు ప్రచారం జరుగుతుంది. వెంకటేశ్వర్లు గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో జరిగిన కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పందించారు. కానిస్టేబుల్ మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతను గత కొంతకాలంగా విధులకు హాజరుకావడం లేదని, అతని భార్య విజ్ఞప్తి తో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని కమీషనర్ వెల్లడించారు.