జగన్ కు వెన్నుపోటు తప్పదా!
posted on Mar 9, 2021 @ 2:34PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కుట్ర జరుగుతోందా? సొంత పార్టీలోనే ఆయన శత్రువులున్నారా? అదను చూసుకుని జగన్ కు వెన్నుపోటు పొడిచేందుుకు కాసుకుని కూర్చున్నారా? ఏపీలో కొన్ని రోజులుగా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నా... ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి ఇది ఊపందుకుంది. జగన్ కు పదవిపోటు పొడిచేందుకు వైసీపీలోనే రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలన్న కుట్ర జరుగుతోందని నర్సాపురం ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. తనకు తెలిసీ ముఖ్యమంత్రిపై కుట్ర చేసే ధైర్యం ఎవరికి ఉంటుందని తాను అనుకోవడంలేదన్నారు. అయితే జాతీయ చానెల్ లో వచ్చిన వార్తను అంత తేలిగ్గా కొట్టిపడేయొద్దని అన్నారు. అందులో ఎంతోకొంత నిజం లేకపోతే ఆ వార్త రాదన్నారు రఘురామ. సీఎం జగన్ ఈ వార్తను అంత తేలిగ్గా తీసిపారేయొద్దని చెప్పారు. ‘మీ వెనుక ఎవరైన దొంగ వెధవులు కుట్ర చేస్తున్నారేమో అన్న దృష్టితో ఆలోచించి నిజమైన బ్లాక్ షీప్ ను పట్టుకోండి’ అని సీఎం జగన్ కు రాఘురామ సూచించారు. ముందుగా చెక్క భజన చేస్తూ.. వెనుక గోతులు తీస్తున్నారేమో అన్న అనుమానం ఉందన్నారు రఘురామ కృష్ణం రాజు.
జగన్ పై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని గతంలోనూ ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి... తన వర్గాన్ని తయారు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తనపై ఉన్న కేసులో ఒకవేళ జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే... జగన్ కుటుంబ సభ్యులు కాకుండా తానే ముఖ్యమంత్రి కావాలని ఆ సీనియర్ మంత్రి భావిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తనపై వస్తున్న వార్తలను సదరు మంత్రి ఖండించారు. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితే రాదు.. ముఖ్యమంత్రి మార్పు ఉండనే ఉండదని చెప్పారు. ఆయన వివరణ ఇచ్చినా ఆ ప్రచారం ఆగలేదు. సదరు మంత్రిపై అనుమానంతో.. జగన్ అతనిపై నిఘా పెట్టారని కూడా అంటున్నారు. తాజాగా జాతీయ చానెల్ కథనంతో జగన్ పై కుట్ర అంశం మరోసారి కలకలం రేపుతోంది.