కాంగ్రెస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
posted on Apr 14, 2013 @ 5:09PM
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు అవడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో కళoకితులుగా ముద్రపడిన తమ మంత్రులను వదులుకోవాలా లేక వారిని కాపాడుకోవడానికి తమ పార్టీ పరువు పణంగా పెట్టాలా అనే విషయాన్నీ తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీ చాలా సతమతమవుతోంది. వారిని సీబీఐకి బలిఇస్తే ఆ ప్రభావం మిగిలిన మంత్రుల మీద పడుతుంది. అంతే కాకుండా కాంగ్రెస్ తన అవినీతిని తానే స్వయంగా అంగీకరించినట్లవుతుంది. పార్టీ తమను కాపాడదనే భావం మిగిలిన మంత్రులలో కూడా కలిగితే, ఏ ఫైలు మీద సంతకం చేస్తే ఏమి మెడకు చుట్టుకొంటుందో అనే భయం మంత్రులలో ఏర్పడి అది ప్రభుత్వపనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక, దైర్యంచేసి వారిని వెనకేసుకు వద్దామననుకొన్నా, ప్రతిపక్షాలు వారిని పదవుల నుండి తొలగించమని చేస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టమే. వారి ఒత్తిడిని ఎలాగో భరించినప్పటికీ, ‘కాంగ్రెస్ అవినీతి-కళoకిత మంత్రుల’ గురించి ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ప్రచారం వలన, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఉన్నవ్యతిరేఖత మరింత పెరిగే అవకాశం ఉంది. అందువలన ఈ సమస్య నుండి ఏదోవిధంగా బయట పడకపోతే వచ్చే ఎన్నికలలో అసలుకే ఎసరు రావచ్చును. అయితే అందుకు కాంగ్రెస్ వద్ద ఉపాయం ఏది లేదు. కానీ, ఈ అంశంపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించే విధంగా ఏదో ఒక సరికొత్త నాటకం మొదలుపెట్టే అవకాశం ఉంది.