త్వరలో ఈటల పదవి గోవిందా.. రేవంత్ రెడ్డి సంచలనం
posted on Jun 13, 2020 @ 6:51PM
కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ శనివారం జర్నలిస్టులు హైదరాబాద్‌లో చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు పలికారు. జర్నలిస్టులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకొని వారికీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కనీసం 50 వేల పరీక్షలు చేయలేదని దీంతో రాష్ట్రం లో కరోనా అదుపు తప్పిందని.. దాన్ని సాకుగా చూపిస్తూ త్వరలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల ను పదవి నుండి తప్పించబోతున్నారని సంచలన ప్రకటన చేసారు. ప్రతి కరోనా రోగికి ప్రభుత్వం మూడున్నర లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతోందని మరి జర్నలిస్ట్ మనోజ్ చికిత్స కోసం ఎంత ఖర్చు చేసారో చెప్పాలని అయన డిమాండ్ చేసారు. జర్నలిస్టులు నిరసన చేపట్టడం లో ప్రభుత్వ వైఫల్యాన్నిసూచిస్తోందని రేవంత్ అన్నారు. సామాన్యుడికి కరోనా వస్తే గాంధీలో చికిత్స అందిస్తున్నారని.. అదే అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోధ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు అని రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి 2లక్షల ఆర్థిక సహాయాన్నిఅయన ప్రకటించారు.