తెదేపాలోకి కాంగ్రెస్ నేతల వలసలు
posted on Feb 28, 2014 @ 11:21AM
ఇంతకాలం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి సమైక్య పోరాటం చేసిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్ తదితరులు ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టబోతుంటే అందులో చేరకుండా తెదేపాలో చేరేందుకు సిద్దపడటం ఆశ్చర్యం కలిగిస్తున్నా మంచి రాజకీయ అనుభవజ్ఞులయిన వారు ముగ్గురు రానున్న ఎన్నికలలో తెదేపాకే విజయావకాశాలున్నాయని ఖచ్చితంగా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. వారితో బాటు కాంగ్రెస్ శాసనసభ్యుడు అదలా ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న చంద్రబాబుని కలిసి మాట్లాడారు. అందువలన ఆయన కూడా తెదేపాలో చేరుతున్నట్లే భావించవచ్చును. వీరు గాక వైజాగ్ నుండి నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా తెదేపాలో చేరబోతున్నారు. ఇది తేదేపాకు శుభసూచకమే అయినప్పటికీ ఒకేసారి ఇంతమంది కొత్తవారు వచ్చి పార్టీలో చేరుతుంటే, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తూ టికెట్స్ ఆశిస్తున్న వారు ఆందోళన చెందవచ్చును. అందరికీ టికెట్స్ కేటాయింపు సాధ్యం కాదు గనుక బహుశః త్వరలోనే తెదేపాలో అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలవుతుందేమో!