కర్నాటకలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు!
posted on May 12, 2023 @ 10:11AM
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (మే 13)న వెలువడతాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు ఎడ్జి ఉంటుందని చెప్పినా.. వివిధ సంస్థలు వెలువరించిన వేర్వేరు ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రస్ ఏకప విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని అయితే యివ్వలేదు. ఒకటి రెండు సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో కర్నాటకలో హంగ్ తప్పదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎంతో విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ లో ఖంగారు మొదలైనట్లు కనిపిస్తోంది. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.
కర్నాటకలో ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి ఒకటి కలిపితే 113 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా ఉంటుందని సర్వేలు అన్నీ స్పష్టంగా చెప్పాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు చేరుతుందన్న అంచనాలకు భిన్నంగా కొన్నిసర్వేలు కాంగ్రెస్ ఆ 113 కొద్ది దూరంలో ఆగిపోతుందని పేర్కొనడంతో కాంగ్రెస్ ఒక వేళ అలా జరిగితే ఏం చేయాలి అన్న దానిపై యిప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. దీంతో ఫలితాలు వెలువడటం మొదలు కాగానే గెలిచిన ఎమ్మెల్యేను గెలిచినట్లుగా క్యాంపునకు తరలించే యోచన చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవాలో క్యాంపు పెట్టాలన్నది కాంగ్రెస్ భావనగా చెబుతున్నారు. యిందుకు తగ్గ ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయని కూడా అంటున్నారు. యిక ఎంత నిర్వేదంలో ఉన్నా ఎవో కొన్న స్థానాలలో గెలుస్తామన్న నమ్మకం ఉన్న జేడీఎస్ కూడా గెలిచిన తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటోంది. సపోజ్ ఫర్ సపోజ్ కర్నాటకలో హంగ్ వస్తే.. కాంగ్రెస్, బీజేపీల చూపు కచ్చితంగా జేడీఎస్ ఎమ్మెల్యేల వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే జేడీఎస్ కూడా తన జాగ్రత్తలో తాను ఉంటోంది.