అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే!
posted on May 9, 2023 @ 9:39AM
ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో భాగమైన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బిజెపిలో కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బుధవారం మే (10)న జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిసినా ఎలాగోలా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి పెద్దలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటకలో ఏదో రకంగా గెలిచేందుకు లేదా కాంగ్రెస్‌ను సాధ్యమైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేసేం దుకు బిజెపి వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. బీజేపీకి కర్నాటకలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరం. ఎందుకంటే కర్నాటక ఫలితం యితర రాష్ట్రాలపై కచ్చితంగా పడుతుందన్నది పరిశీలకుల అంచనాయే కాకుండా బీజేపీ భావన కూడా. ఒక వేళ కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతే ఇక దక్షిణాదిన అడుగుపెట్టే అవకాశాలు ఆ పార్టీకి దాదాపుగా మృగ్యమౌతాయి. అలాగే ఉత్తరాది పార్టీగానే బీజేపీ గుర్తింపు కొనసాగుతుంది. ఆ కారణంగానే బీజేపీ అగ్రనేతలు కర్ణాటక ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దక్షిణాదిన తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బిజెపి నేతలు పార్టీలో చేరికలకు తలుపులు బార్లా తెరిచేశారు.
కేరళలో ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ, తమిళనాడులో చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు సిఆర్ కేశవన్, ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా దక్షిణాదిలో తమకు ఇంకా ఉనికి ఉన్నదని చెప్పేందుకు బిజెపి అగ్రనేతలు తంటాలు పడుతున్నారు. తాను డిమాండ్ చేసిన విధంగా సీట్లు కేటాయించేందుకు అధిష్ఠానం అంగీకరించకపోవడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసంతృప్తి తో ఉన్నారు. కర్ణాటక బిజెపిలో అధికార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన అధికార కేంద్రమైన యడ్యూరప్ప పట్టు నుంచి బిజెపిని తప్పించేందుకు ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతమైయ్యాయనన సంగతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సఫలమయ్యాయన్నది తేలిపోతుంది. వెూడీ, అమిత్ షా కర్ణాటక రాజకీయాలను శాసించాలను కున్నా, శాసించగల పరిస్థితిలో లేరని స్థానిక రాజకీయాలు తెలిసిన వారు అంటున్నారు.
కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి మరో నేతకు అప్పగించడంలో వెూడీ, షాలు విజయం సాధించగలిగారు కాని పార్టీకి విజయం దిశగా నడిపించగలిగిన మరో నాయకుడిని అయితే వారు గుర్తించలేకపోయారు. అలాగే యడ్యూరప్ప ఆధిపత్యాన్ని తగ్గించడంలో విఫలమయ్యారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఫిబ్రవరిలో తన 80వ జన్మదినం సందర్భంగా యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రకటించారు. అయినప్పటికీ యడ్యూరప్పను విస్మరించి బిజెపి అధిష్ఠానం కర్ణాటకలో రాజకీయాలు చేయగలిగిన పరిస్థితిలో లేదు. ఉత్తరాదిన చక్రం తిప్పినట్లు దక్షిణాదిన చక్రం తిప్పడం అంత సులభం కాదని వెూదీ, షా లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిజానికి ఉత్తరాదిన కూడా యోగి ఆదిత్యనాథ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల ఆధిపత్యాన్ని వారు తగ్గించలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను గౌరవించడం లేదు.
అవినీతి నేతలను దూరం పెట్టడంలోనూ విఫలమయ్యారు. అయితే యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆలస్యంగా అయినా గుర్తించిన నేతలు.. ఎన్నికల తర్వాత యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానంతో అమిత్ షా శాంతిప చేశారని ప్రచారం సాగుతోంది. మిగతా రాష్టాల్లో 75 ఏళ్లు దాటిన నేతల్ని ప్రక్కన పెట్టగలిగిన వెూడీ, షాలు కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో అంత సాహసం చేయలేకపోయారు. ఢిల్లీ ప్రమేయం లేకుండా తన కుమారుడికి, ఇతరులకు యడ్యూరప్ప సీట్లు ప్రకటించే స్థితిని అడ్డుకోవడానికి అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది.
గత లోకసేభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ లాంటి నేతలు సైతం వెూడీ హవాలో ఓడిపోయారు. ఈ గెలుపులో యడ్యూరప్ప పాత్ర కన్నా వెూడీ పాత్రే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అంతకు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పకు స్వేచ్ఛ నిచ్చినప్పటికీ, సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనపడినప్పటికీ బిజెపి మెజారిటీ సీట్లను సాధించలేకపోయింది. అయినప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ద్వారా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. యడ్యూరప్ప కాలంలో జరిగిన అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి తెలిసినా ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. అరాచక, అవినీతి పాలనను అరికట్టలేక పోయారు. కర్ణాటకలో వారసత్వ రాజకీయాలను, ఘోరంగా విస్తరించిన అవినీతిని అదుపు చేయలేని ప్రధానమంత్రి నరేంద్రవెూడీ తెలంగాణ వంటి ఇతర రాష్టాలకు వెళ్లి వారసత్వ పాలనను, అవినీతిని విమర్శించడాన్ని జనం గుర్తించడం లేదని భావించడం కమలనాథులు చేస్తున్న పొరపాటుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నా బిజెపికి దక్షిణాది నాడి తెలియదని చెప్పేందుకు మాత్రమే ఈ చేరికలు దోహదం చేస్తాయి. బిజెపిలో చేరుతున్న వారిని, బిజెపి భావజాలాన్ని అభిమానిస్తున్న వారిని చూస్తుంటే రాజకీయాల్లో సైద్దాంతిక దృక్పథం కన్నా అవకాశవాదం, స్వప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.