మున్సిపోల్స్ లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదా?
posted on Dec 26, 2019 @ 1:23PM
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ మున్సిపోల్స్ వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులా? లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే, ఎన్నికలంటేనే కాంగ్రెస్ కు వణుకు పుడుతుందోని... అందుకే ఎన్నికల అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కౌంటరిస్తోంది.
అయితే, కాంగ్రెస్-టీఆర్ఎస్ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనబెడితే... 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఏకపక్ష విజయాలు సాధిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంచుకోటలో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. దాంతో, మున్సిపోల్స్ లోనూ టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి రాకముందు 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక వార్డులను కైవసం చేసుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు 55 మున్సిపాలిటీల్లో 1399 వార్డులను జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 517 గెలుచుకుంది. టీఆర్ఎస్ 312 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో... ఆనాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీయే గెలుస్తూ వచ్చింది. అయితే, 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఊహించనివిధంగా ఎంపీ స్థానాల్లో సగం సీట్లను కాంగ్రెస్, బీజేపీ గెలుచుకున్నాయి. అయితే, ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ సత్తా చాటింది. దాంతో, మున్సిపోల్స్ లోనూ తమదే విజయమని గులాబీ పార్టీ విశ్వాసంతో ఉంది.
అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటోందని, ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని టీకాంగ్ నేతలు అంటున్నారు. అలాగే, జాతీయ పరిణామాల ప్రభావం మున్సిపోల్స్ పై ఉంటుందని, ఫలితాలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో... మున్సిపోల్స్ ఫలితాలు ఏకపక్షంగా ఉండబోమని అంటున్నారు. మరి తెలంగాణ మున్సిపోల్స్ లో కొత్త రాజకీయం ఆవిష్కృతం కానుందో? లేక ఎప్పటిలాగే అధికార టీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.