కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే
posted on Feb 19, 2014 6:08AM
సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ ఎంతగా వంచించిందో, సీమాంధ్రకు న్యాయం చేయకపోతే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతూవచ్చి చివరికి బిల్లుకి మద్దతు ఇచ్చిన బీజేపీ కూడా అంతకంటే ఎక్కువగానే వంచించిందని చెప్పక తప్పదు. పైగా తాము మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి కట్టుబడి ఉన్నదునే బిల్లుకి మద్దతు ఇచ్చామని, కానీ కాంగ్రెస్ పార్టీయే బిల్లు విషయంలో ద్వంద వైఖరి అవలంబించిందని గొప్పగా చెప్పుకొన్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఆడిన ఈ నాటకంలో సీమాంధ్ర ప్రజలు మోసపోయారు. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే బీజేపీ సీమాంధ్రకు అన్యాయం జరిగిందని, దానికోసం రాజ్యసభలో పోరాడుతామని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, రెండు పార్టీలు కలిసి సీమాంధ్ర ప్రజలను ఇంత దారుణంగా వంచించిన తరువాత కూడా ఆ పార్టీలు ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నించడం, తమ మాటలను ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో , కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాగలిగినపుడు ఆ హామీలకు విలువ ఏమయినా ఉంటుంది. లేకుంటే, తరువాత అధికారంలోకి వచ్చే బీజేపీ వాటిలో ఎన్ని అమలు చేస్తుందో, ఎన్నిటికి కొర్రీలు వేసి తప్పించుకొంటుందో ఎవరికీ తెలియదు. గతంలో విడిపోయిన రాష్ట్రాలకే ఇంతవరకు అతీగతీ లేనప్పుడు, లక్షల కోట్లు ఖర్చు వెచ్చించి మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేయవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకొంటాయని భావించడం అడియాశే అవుతుంది. కాంగ్రెస్ చేసిన ఈ దుశ్చర్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనీసం మరో ఒకటి రెండు దశాబ్దాలపాటు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అందుకు ప్రతిగా తమను ఇంత ఘోరంగా వంచించిన కాంగ్రెస్, బీజేపీలు కూడా త్వరలో జరగనున్న ఎన్నికలలో తగు మూల్యం చెల్లించుకొనేలా ప్రజలే శిక్షించాలి. తమ ఆత్మాభిమానంపై చావుదెబ్బ తీసిన ఆ రెండు పార్టీలకు తగిన గుణపాటం చెప్పవలసి ఉంటుంది.