కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
posted on Mar 25, 2023 @ 10:43AM
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ సారి కర్నాటకలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అందుకు అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం అవ్వడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం (మార్చి 25) ప్రకటించింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 124 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించింది. ఆ జాబితా ప్రకారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు టికెట్ దక్కింది. మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ మంత్రి మునియప్ప, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే తదితరులు తొలి జాబితాలో టికెట్ దక్కించుకున్నవారిలో ఉన్నారు.