జైలు భయంతోనే కేసీఆర్ యూ టర్న్!
posted on Dec 28, 2020 @ 11:50AM
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. తాను జైలుకు వెళ్లకుండా ఉండేందుకు . కేసీఆర్ రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్‌ను మరిపిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఒకటి మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లి మరొకటి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలపైనా మల్లు రవి మండిపడ్డారు. బండి సంజయ్ చెప్పినట్లు కేసీఆర్‌ను జైల్‌కు ఎప్పుడు పంపిస్తారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విత్తన సబ్సిడీ, ఇన్సూరెన్స్‌లు తీసేసి రైతుల జీవితాలతో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ దరిద్రపు పాలన కొనసాగిస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతులను నట్టేట ముంచి మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్పీ ఇవ్వాల్సిన ప్రభుత్వం.. లాభ నష్టాల గురించి ఆలోచిస్తుందని మండిపడ్డారు. దేశంలో మొదటగా జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదం కాంగ్రెస్ తీసుకొచ్చింది అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మరోవైపు నియంత్రిత సాగును ఎత్తివేస్తూ, పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద శ్రీధర్ రెడ్డి అనే రైతు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతుల పంటలు ఎవరు కొనాలని.. వారికి గిట్టుబాటు ధర ఎవరు ప్రకటించాలని రైతు శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రకటనను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకు తాను ధర్నా కొనసాగిస్తానని తెలిపారు. అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేయడానికి వీలు లేదంటూ శ్రీధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.