కర్నాటకంలో పీసీసీ చీఫ్ ఓటమికి ఉమ్మడివ్యూహం ?
posted on Apr 27, 2023 @ 12:38PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మినహా మిగిలిన 223 నియోజక వర్గాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ మొత్తం 224 స్థానాల్లోనూ అభ్యర్ధులను బరిలో నిలిపింది. జేడీఎస్ కూడా ఈసారి మూడొంతులకు పైగా పైగా స్థానాల్లో ఒంటిరిగా పోటీచేస్తోంది. అయితే, 10న జరిగే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? ఎవరు అధికారంలోకి వస్తారు? కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరు? అనే చర్చ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో జోరుగా సాగుతోంది. సర్వేలు చెప్పే జోస్యాలు సర్వేలు చెపుతున్నాయి. ఒక సర్వే బీజేపీకి ఎడ్జి ఉందంటే మరో సర్వే కాంగ్రెస్ దే పై చేయి అంటోంది. అయితే ఎక్కువ సర్వేలు హంగ్ అనివార్యమని అంటున్నాయి. చివరకు ఏమి జరుగుతుంది? కర్ణాటక ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుంది? అనేది మే 13 న తేలిపోతుంది.
అదలా ఉంటే... ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రత్యర్ధి పార్టీలను ఓడించడంతో పాటుగా, కొందరు కీలక నేతలు సొంత పార్టీలోని ప్రత్యర్ధులను ఓడిచడం పైనా కన్నేశారు. అలాగే ప్రత్యర్ధి పార్టీలలో బలమైన నాయకులను ఓడించేందుకు అదే పార్టీలోని కీలక నేతలు ఉమ్మడి శత్రువును ఓడించేందుకు ఉమ్మడి వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వ్యూహంలో భాగంగానే బీజేపీ అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఓడించడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని ఆపార్టీ నాయకులు బహిరంగంగానే చెపుతున్నారు. డీకేకు సవాలు విసురుతున్నారు.
అమేథిలో రాహుల్ గాంధీని వదలని మేము నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా అంటూ కేపీసీసీ అధ్యక్షుడిని ఓ బీజేపీ సీనియర్ నేత హెచ్చరించడం కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి, డీకే శివకుమార్ పోటీలో లేకుండా చేసేందుకు కూడా బీజేపీ కొన్ని చట్టబద్ధ ప్రయత్నాలు చేసిందనే ప్రచారం జరిగింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులను సాకుగా చూపించి, కనకపుర రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందుకే ముందు జాగ్రత్తగా డీకే సోదరుడు బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ కూడా ఆఖరి క్షణంలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే డీకే నామినేషన్ ఆమోదం పొందడంతో ఆయన బరిలో నిలిచారు.అయితే బీజేపీ మాత్రం కనకపురా నియోజకవర్గంలో డీకేను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉందని, అందుకే డీకే మీద పోటీకి ఆయనకు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచే మంత్రి ఆర్.అశోక్ ను బరిలో దించిందని అంటున్నారు.
నిజానికి, బెంగళూరు నగర శివార్లలో ఉన్న కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం డీకే కంచుకోట. ఇప్పటికే వరసగా మూడు సార్లు గెలిచిన ఈ నియోజక వర్గలో నాలుగో సారి గెలవడం డీకేకు నల్లెరుమీద నడక అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నశివకుమార్ ను ఓడించేందుకు కాంగ్రెస్ లోనే ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గం డీకే ను ఓడిస్తే, ఇక తమ నేతకు తిరుగుండదని ఆ దిశగా పావులు కదుపుతోందని డీకే అనుచర వర్గంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి సిద్దరామయ్యకు బీజేపీ ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి, బీజేపీ అధికారంలోకి రావడం వెనక ‘సిద్ద’ హస్తం ఉందని అంటారు. సరే అదలా ఉంటే కారణాలు ఏవైనా కనకపురాలో డీకే ఓడించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి ఆర్. అశోక్ ను గెలిపించాలని బీజేపీ నాయకులు ఇప్పటికే కనకపురలో ప్రచారం ముమ్మరం చేశారు. కర్ణాటక మాజీ మంత్రి సీటీ. రవి కనకపురలో ఆర్. అశోక్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు. సీటీ. రవితో పాటు స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బీజేపీ నేత సీటీ. రవి మాట్లాడుతూ అమేథిలో వరుసగా ఎంపీగా విజయం సాధిస్తున్న రాహుల్ గాంధీకి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మేము సినిమా చూపించామని అన్నారు. అమేథి నియోజక వర్గంలో మీ నాయకుడు రాహుల్ గాంధీనే మేము వదల్లేదు. కనకపురలో నిన్ను వదిలేస్తామా అంటూ. రవి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు నేరుగానే సవాల్ విసిరారు. అయితే ఇది ఒక విధంగా శివకుమార్ పై మానసిక వత్తిడి పెంచి ఆయన్ని నియోజక వర్గంనికి పరిమిత చేసేందుకు బీజేపీ రవి ప్లే చేసిన ట్రిక్ అయినా కావచ్చని, అయినా, ఇప్పటికే మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు సార్లు మంత్రిగా పనిచేసిన పీసీసీ చీఫ్ ను ఓడించడం అంత ఈజీ వ్యవహారం కాదని, అలాగే,ఆయన నియోజకవర్గానికి పరిమితం చేయాలనుకోడం కూడా అయ్యేపనికాదని పరిశీలకులు అంటున్నారు. అయితే, కాంగ్రెస్ లోని డీకే వ్యతిరేక వర్గం బీజేపీతో నేరుగా చేతులు కలిపితే మాత్రం డీకే గెలుపు నల్లేరుమీద బండి నడక కాకపోవచ్చనీ పరిశీలకులు అంటున్నారు.