సొంత విమానాలు, చాపర్లపై సీఎంల మోజు
posted on Dec 30, 2022 @ 3:44PM
పార్టీ అధినేతలూ, ముఖ్యమంత్రులకు ఇటీవలి కాలంలో సొంత చాపర్లు, విమానాల మీద మోజు పెరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కనీసం పట్టించుకోకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా చాపర్లు, విమానాల కొనుగోలుకు వినియోగించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తెరాసను భారాసగా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేసిన కేసీఆర్ ఇక దేశ వ్యాప్తంగా చేసే పర్యటనల కోసం.. అవును కేవలం ఆయన పర్యటనల కోసమే రూ.80 కోట్లతో సొంత చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు.
ఇప్పటి వరకూ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని సాహసం ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నెల నెలా ఒకటో తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఎత్తి చూపుతూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఆయన సొంత విమానం కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. పైగా ఆ విమానం ఖర్చు పార్టీ నేతలు కొందరు బరిస్తారంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె పేరు బయటకు రావడంతో... ఇక ఇలా కాదు.. నాకు విమానం వాళ్లూ, వీళ్లూ కొనిచ్చేదేమిటి..తానే కొనేస్తే పోలా అనుకున్నారు.
కాగా ఇలా ప్రత్యేక విమానంలో, అంటే సొంతంగా తన కోసమే ఏర్పాటు చేసుకున్న విమానంలో జాతీయ పర్యటనలు చేసిన చరిత్ర గతంలో మోడీకి మాత్రమే ఉంది. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశ మంతటా ప్రత్యేక విమానంలో పర్యటనలు చేశారు. అయితే ఆ విమానాన్ని ఆయన కొనుగోలు చేయలేదు. ఆయనకు సన్నిహితుడిగా, మిత్రుడిగా ఉన్న ఓపారిశ్రామిక వేత్త మోడీ కోసం దానిని సమకూర్చారు.
ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్ కూడా ప్రభుత్వంలోని వీవీఐపీలు తిరిగేందుకు జెట్ విమానాలు, చాపర్లు కొనాలని నిర్ణయించారు. ఈ కొనుగోలు ప్రభుత్వం తరఫున చేయాలని నిర్ణయించేశారు. కేసీఆర్ సొంత విమానం కొనడంపై ఎలాగైతే విమర్వలు వెల్లువెత్తాయో, ఇప్పుడు నితీష్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం జెట్ విమానాలు, చాపర్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయంపై కూడా అలాగే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం 250కోట్ల రూపాయల ఖర్చుతో జెట్ విమానాలు, చాపర్లు కొనుగోలు చేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.