ఓ పాట‌కాలం మ‌నిషి...పాడిమోసిన నేటికాలం మ‌నిషి

 

ఈ మ‌ధ్య‌కాలంలో ఒక ముఖ్య‌మంత్రి పాడె మోసిన ఘ‌ట‌న అరుద‌నే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ఈ విష‌యంలో ఎంతో ఎత్తుకు ఎదిగార‌ని చెప్పాల్సి ఉంటుంది. 

గ‌త  ప్ర‌భుత్వ  జ‌మానాలో కొంద‌రు నాయ‌కులు అక‌స్మాత్ మ‌ర‌ణం పాలైతే.. వారికి క‌నీసం రాజ‌లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌లేదు.

అలాంటిది  నేడు తెలంగాణ రాష్ట్ర గీతం ర‌చించిన అందెశ్రీకి భారీ ఎత్తున గౌర‌వం ల‌భించింద‌నే చెప్పాలి. ఆయ‌న తాను ర‌చించిన  రాష్ట్ర‌గీతం జ‌నం  నోళ్ల‌లో నాన‌డం మాత్ర‌మే కాదు.. ఆయ‌న కంటి ముందు ప్ర‌భుత్వ ఆమోదం పొందింది. ఆపై ఇందుకుగానూ కోటి రూపాయ‌ల న‌జ‌రానా సైతం ల‌భించింది. 

ఇవే ఆయ‌న త‌న జీవిత కాలంలో చూసిన అత్యున్న‌తాల‌నుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయ‌న పాడె భుజానికెత్తుకుని మోసి.. గొప్ప స‌హృద‌య‌త చాటుకోవ‌డంతో ఇదొక‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నువ్వు చ‌రిత్ర‌లో నిలిచిపోతావు రేవంత‌న్నా! అంటూ మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు అందెశ్రీ  కోసంగానూ ఒక స్మృతి వ‌నం  సైతం ఏర్పాటు చేసే దిశ‌గా రేవంత్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో.. ఆహా ఓహో అని చెప్పుకుంటున్నారు తెలంగాణ వాసులు.

మాములుగా అయితే అందెశ్రీ  రాసిన ర‌చ‌న‌లు ఏమంత ఎక్కువ‌గా ఉండ‌వు. చాలా చాలా ప‌రిమితంగా మాత్ర‌మే  ఉంటాయి ఆయ‌న గేయాలు. కానీ, ఇక్క‌డ‌ గొప్ప‌ద‌నం ఏంటంటే.. ఆయ‌న ర‌చ‌న‌ల్లో రాశి లేక పోయినా వాసి ఎక్కువ‌. త‌క్కువే రాసిన అది జ‌నం మాట పాట‌గా వ‌చ్చిన అరుదైన బాణీ. అంతే  కాదు తెలంగాణ ఉద్య‌మ కాలంలో తీవ్ర ప్ర‌భావితం చేసింది ఆయ‌న సాహిత్యం. 

ఇక రాష్ట్ర గీత‌మే రాయ‌డంతో.. ఆయ‌న‌కు ఎక్క‌డా లేని ప్రాధాన్య‌త ల‌భించింది. అలాగ‌ని గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను అక్కున చేర్చుకోలేదు స‌రిక‌దా  ప‌క్క‌న  పెట్టేసింది. ఇది గుర్తించిన రేవంత్ నేతృత్వంలోని నేటి  తెలంగాణ‌ ప్ర‌భుత్వం అందెశ్రీ గీతాన్ని ఆమోదించ‌డంతో పాటు ఇదిగో ప‌రి ప‌రి విధాలుగా ఆయ‌న్ను గుర్తించి గౌర‌వించ‌డంతో.. ఇది సాహితీ చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఒకానొక సువ‌ర్ణ అధ్యాయంగా భావిస్తున్నారంతా.
 

న్యూ ఇయర్ వేడుకల్లో జీరో డ్రగ్స్ విధానం..అధికారులకు సీపీ సజ్జనార్ ఆదేశం

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎటువంటి ఉదాశీనతా వలదని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టాలన్నారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం (డిసెంబర్ 26)న  హెచ్-న్యూ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సీపీ సజ్జనార్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.   ఈ సందర్భం గా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగించిన తరువాత దాడులు చేసి కేసులు నమోదు చేయడం కాదనీ, తక్షణమే అంటే ఇప్పటి నుంచే   హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించి డ్రగ్స్ వినియోగానికి అవకాశం లేకుండా చేయాలన్నారు.  అలాగే  సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా పెట్టాల న్నారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలపై దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డ్రగ్స్ సరఫరాదారులు, డ్రగ్ ఎడిక్ట్స్ పై  నిఘా ఉంచాలని ఆదే శించారు.  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని సీపీ ఆదేశించారు. సమయ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. న్యూఇయర్ సందర్భంగా కీలకమైన ప్రాంతాలలో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారి కేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.   అదే సమయంలో  నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వేడు కలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.పోలీసులంతా సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.

డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు

డ్రగ్స్ కేసులో తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్  దర్యాప్తు ముమ్మరం చేసింది. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసే వారిపై కొరడా ఝళిపిస్తున్నది.ఈ క్రమంలోనే  ప్రముఖ నటి రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ అజ్ఞాతంలోకి  వెళ్లాడు.  ఈగల్ బృందం, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ  డ్రగ్స్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకు న్నారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులు విచారణలో  తమ నుంచి తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసే నలుగురి పేర్లు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడని తేలింది. అతడికి డ్రగ్స్ డెలివరీ ఇచ్చే సమయంలోనే ఈగల్ ఆపరేషన్ లో ఈ వ్యాపారులు అరెస్టయ్యారని తెలిసింది.  ఇలా ఉండగా  రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్  గత ఏడాది కూడా డ్రగ్స్ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులకు దొరికాడు, ఆ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇద్దరు డ్రగ్స్ వ్యాపారుల అరెస్టుతో అతడి పేరు బయటకు వచ్చింది. వ్యాపారుల అరెస్టు విషయం తెలియగానే అమర్ ప్రీతి సింగ్ పారారయ్యాడని తెలుస్తోంది.   ఈగల్ బృందం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం (డిసెంబర్ 26) తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో భారతీయ వైజ్ణానిక సమ్మేళన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శించారు. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం సీనియర్ నేత ఎన్టీఆర్ రాజు ఇటీవల తిరుపతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజు కుమారుడు, తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన చంద్రబాబు,  వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలులర్పించారు.  

సమస్యలపై మంత్రిని నిలదీస్తూనే ఆగిన రైతు గుండె

రాజధాని అమరావతిలోని మండడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మునిసిల్ శాఖ మంత్రి  నారాయణ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు.   రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా   ఘటన జరిగింది.  అమరావతిలో ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో  పాల్గొన్న రైతు దొండపాటి రామారావు  తమ సమస్యలపై తొలుత ప్రశాంతంగానే మాట్లాడారు. అయితే మధ్యలో తీవ్ర ఆవేదనకు, ఆవేశానికీ లోనయ్యారు.   ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తమ ఇళ్లు పొలాలూ తీసుకుని రోడ్డున పడేస్తారా అంటూ మంత్రిని నిలదీశారు.  ఆ వెంటనే   గుండెపోటుతో కుప్పకూలిపోయారు.  దీంతో అక్కడున్న అధికారులు, రైతులు రామారావుకు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ వెంటనే అతడిని మంత్రి కాన్వాయ్ వాహనంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు అయితే..  అప్పటికే  ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. నిర్వాసిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.  భూ సమీకరణలో భాగంగా రాములు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు. ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు కోల్పోతున్న వారి జాబితాలో ఆయన ఇల్లు కూడా ఉంది.

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు  రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ గ్రౌండ్స్‌పై  అన్ ఫిట్‌గా గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత అన్ ఫిట్ పొందిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారిని సర్దుబాటు చేయనున్నారు.  గతంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో వందలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ అన్‌ఫిట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

పెట్రోల్ బంక్ లోకి దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్

  మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ అన్నోజిగూడ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న ఓ ఓమ్ని వ్యాన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు భయపడిపోయి వెంటనే కిందకు దిగి పరుగులు తీశారు. అయితే, మంటలు అంటుకున్న సమయంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అదుపు తప్పిన ఓమ్ని వ్యాన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వైపు దూసుకెళ్లింది. మంటలతో వస్తున్న వాహనాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నీళ్ళు, అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహన దారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతు లకు గురయ్యారు.  కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాను పెట్రోల్ బంకులోకి దూసుకు వస్తున్న సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేనిచో ఊహకందని ప్రమాదం జరిగేదని స్థానికులు అంటూ.‌... పెట్రోల్ బంక్ సిబ్బందిని అభినం దించారు.

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రికార్డు బ్రేక్... అత్యధిక ప్రేక్షకులు హాజరు

  ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్  రికార్డు బద్దలుకొట్టింది. బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు మ్యాచ్ వీక్షించడానికి 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు 93,013 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ చేసింది. ఇదే ఇప్పటివరకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదైన అత్యధిక ప్రేక్షకుల రికార్డ్.  మొత్తంగా క్రికెట్ చరిత్రలో 2022 ఐపీఎల్ ఫైనల్‍ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరయ్యారు.  ఆ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తన రికార్డు తానే బద్దలుకొట్టింది. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌‌ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు టెస్ట్ మ్యాచ్ వీక్షించడానికి ఏకంగా 94,199 మంది క్రికెట్ అభిమానులు వచ్చారు. దీంతో గ్రౌండ్‌లో స్టాండ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అంతకుముందు ఈ మ్యాచ్‌కు 93,422 మంది ప్రేక్షకులు వచ్చినట్లు MCG గ్రౌండ్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.  ఆ తర్వాత గంట వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది అభిమానులు పెరిగినట్లు ప్రకటించింది.కాగా, 2015 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ వీక్షించడానికి 93,013 మంది అభిమానులు వచ్చారు. ఆ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్ట్ అధిగమించింది. ఇదే కాకుండా 2013లో జరిగిన బాక్సింగ్‌డే టెస్టుకు కూడా భారీ సంఖ్యలో (91,112 మంది) క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.  MCG మొత్తం సామర్థ్యం 1,00,024. మరోవైపు, క్రికెట్ గ్రౌండ్లలో అత్యధిక మంది ప్రేక్షుకులు హాజరైన రికార్డ్ గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఉంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ఏకంగా 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షుకులు వచ్చిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది. ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.   

2047 నాటికి ఇండియా సూపర్ పవర్.. ఏ శక్తీ అడ్డుకోలేదు.. చంద్రబాబు

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్  ప్రారంభ సదస్సుకు చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం ( డిసెంబర్ 29) వరకూ తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబిబు ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు.  పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం సభను ప్రారంభించారు.  సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఏపీ సీఎం ప్రస్తుతించారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్న ఆయన  ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందన్నారు.   భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్న  అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలు 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు.రెండు వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేదనీ,  నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదనీ వివరించారు.  2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.  సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇండియా చాంపియన్ అన్నారు.    ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతుని చెప్పిన చంద్రబాబు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని పురోగమిస్తోందన్నారు.  ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాణి దర్శనం టికెట్లు రద్దు.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో  భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంటకేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేవదేవుడి దర్శనం కోసం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సెలవుదినాలు, వారాంతాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనూ టీటీడీ శ్రీవాణి దర్శనం టికెట్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది.  అయితే ఆన్ లైన్ లో పూర్తి అయిన శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన వారిని అనుమతించనుంది.  అంతే కాకుండా ఇక నుంచి ఆఫ్ లైన్ విధానాని రద్దు చేసి.. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో దర్శన టిక్కెట్లు జారీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.  

జీహెచ్ఎంసీ.. దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలనలో  తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. ఈ మార్పుల మేరకు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య ప్రస్తుతమున్న వాటికి రెట్టింపైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.   దీంతో  2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. డీలిమిటేషన్ లో భాగంగా   నగరంలో  జోన్లు , సర్కిళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం  పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచింది. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటయ్యాయి.  45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా  అవసరమైన చర్యలు తీసుకుంది.  ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి దాదాపు ఆరు వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న అనంతరం తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇక పోతే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిదే. ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.