మోడీకి వ్యతిరేకంగా నితీశ్ వ్యూహం
posted on Nov 12, 2015 @ 4:34PM
బీహార్ ఎన్నికల్లో మహా కూటమి అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీజేపీ కి ఊహించని దెబ్బ తగిలింది. మొదటి నుండి గెలుపు తమదనే భావనతో ఉన్నా.. ఎవరూ ఊహించని విధంగా మహా కూటమి గెలుపొంది అందరికి షాకిచ్చింది. దీంతో ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరూ ఒక్కటయ్యేవిధంగా నితీశ్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలోభాగంగానే ఈ నెల 20న జరగబోయే తన ప్రమాణస్వీకారానికి పలువురు రాష్ట్రాల నేతల్ని ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కి నితీశ్ ఆహ్వానం పంపారు. దానికి వారినుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్.. హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా నితీశ్ తన ప్రమాణస్వీకారానికి మోడీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరి నితీశ్ ఆహ్వానించిన నేపథ్యంలో మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.