ధర్మాన వ్యవహారంఫై సిఎం కు అధిష్టానం క్లాస్ ?
posted on Dec 24, 2012 6:01AM
ధర్మాన ప్రసాదరావు వ్యవహారంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ లో క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ధర్మానను ప్రాసిక్యూషన్ చేయడానికి సిబిఐ కు రాష్ట్ర మంత్రి మండలి అనుమతి నిరాకరించిన విషయం, ఆ ఫైలును గవర్నర్ నరసింహన్ తిప్పి పంపిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే.
ధర్మాన వ్యవహారంలో ముఖ్య మంత్రి వ్యవహరించిన తీరుఫై పార్టీ పెద్దలు తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ లో పార్టీ కీలక నేతలను ఎవరినీ సంప్రదించకుండా ఈ వ్యవహారాన్ని నడిపిన తీరుఫై వారు కిరణ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి విషయం చెప్పిన తర్వాతే ప్రాసిక్యూషన్ ఫై నిర్ణయం తీసుకున్నానని మంత్రులకు చెప్పినట్లు తమ వద్ద ఫిర్యాదులు ఉన్నాయని, దీనిఫై వివరణ ఇవ్వాలని కిరణ్ ను అడిగినట్లు సమాచారం.
గవర్నర్ నరసింహన్ ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళిన తర్వాతే, వారికి విషయ తీవ్రత అర్ధం అయిందని, ఆ కారణమే వల్లనే వారు కిరణ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తదుపరి చర్య తీసుకోవడానికి ఈ నెల 30 న ఈ విషయంలో వచ్చే కోర్టు తీర్పు వరకూ వేచి చూడాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తునట్లు సమాచారం.