సమయపాలన లేని సీఎం
posted on Nov 2, 2013 @ 12:47PM
ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారికి సరైన విధంగా నష్టపరిహారం ఇవ్వాలని, నష్టాన్ని అంచనా వేయడంలో సక్రమంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు భావించారు. దీనికోసం శనివారం ఉదయం 11.30 నిమిషాలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. అయితే అనుకున్న సమయానికి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన కార్యాలయంలో లేకపోవడంతో హతాశులయ్యారు. చెప్పిన సమయానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో లేకపోవడం పట్ల వారు అక్కడే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీఎంని కలవటానికి ఎమ్మెల్యేలమైన తమకే సాధ్యం కావడం లేదంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.
సీఎం తీరును నిరసిస్తూ తమ ముఖ్యమంత్రికి అందించదలచిన వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయం గోడకి అతికించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఈ సందర్భంగా విమర్శించారు. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బలవంతంగా పంపించడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్యతోపులాట జరిగింది.