శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం
posted on Aug 21, 2020 @ 4:11PM
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్ ను నియమించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని చెప్పారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
కాగా, ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే, ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అలాగే ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు.