కేసీఆర్ మనవడు హిమాన్షు కాలు ఫ్రాక్చర్.. రాత్రంతా హాస్పిటల్ లోనే ఉన్న కేటీఆర్ దంపతులు..!
posted on Oct 1, 2020 @ 9:34AM
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు కాలికి గాయాలయినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి హిమాన్షును చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. నొప్పి కారణంగా నిలబడలేని స్థితిలో ఉన్న హిమాన్షు కు యశోద ఆస్పత్రి వైద్యులు సీటీ స్కాన్ చేశారు. తుంటి ప్రాంతంలోను, మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ దంపతులు రాత్రంతా ఆస్పత్రిలో కుమారుడితో పాటే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే హిమాన్షు నిన్న రాత్రి ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత కొంత కాలంగా హిమాన్షు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆపదలో ఉన్న వారు వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక సాయం కోసం ఎవరైనా ట్విటర్‌లో రిక్వెస్ట్ పెడితే ఆయన వెంటనే స్పందిస్తూ తన వల్ల సాధ్యం అయ్యే సాయం చేస్తున్నారు. దీంతో హిమాన్షును తాతకు దగ్గ మనవడు, తండ్రికి దగ్గ కొడుకు అని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాక మనవడు హిమాన్షు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ. దీంతో మనవడు గాయపడడంతో సీఎం కేసీఆర్ యశోదా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి దీని గురించి ఆరాతీసినట్లు సమాచారం.