చెరువులు తెగొచ్చు.. బీ రెడీ! కేసీఆర్ గ్రేటర్ అలర్ట్
posted on Oct 21, 2020 @ 7:17PM
కుండపోత వానలు, వరదలతో వణికిపోతున్న హైదరాబాద్ ఇంకా ముంపు గండం నుంచి బయటపడలేదు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ప్రభుత్వంతో పాటు నగర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని చెరువులకు గండ్లు పడవచ్చని, తెగే అవకాశం ఉందన్న ప్రచారం మరింత భయపెడుతోంది. వర్షాలు, వరదల పై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కూడా అధికారులను చెరువులపై అలర్ట్ చేశారు. దీంతో ముంపు భయంతో లోతట్టు ప్రాంత ప్రజలు, బస్తీవాసులు, మూసి పరివాహక జనాలు, చెరువులకు కింది భాగంలో ఉన్న కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో నరకం అనుభవిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని అధికారుల సమావేశంలో కేసీఆర్ చెప్పారు. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలోని చెరువుల ద్వారా కూడా చాలా నీరు వచ్చి చేరడంతో నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ఇప్పటికే నిండుగా ఉన్న చెరువుల్లోకి మరింత వరద వస్తే.. వాటికి గండి పడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలున్నాయని అధికారులను అలర్ట్ చేశారు సీఎం కేసీఆర్. నగర పరిధిలోని చెరువులకు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందన్న సీఎం.. అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ సూచనలతో నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో 15 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చెరువుల కట్టలు తెగే లేదా గండ్లు పడే అవకాశం ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేయడానికి ఈ బృందాలను రెడీగా ఉంచుతున్నారు. వరద నీటి ముంపు ప్రమాదమున్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక బృందాలను ఉపయోగించనున్నారు.
ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హైదరాబాదీలు క్షణమెక యుగంలా గడుపుతున్నారు. ఆకాశంలో మేఘాలు కనిపించినా, కారు మబ్బులు ఉన్నా ఉలిక్కిపడుతున్నారు. తుఫానులు, వాయుగుండాలు వచ్చిన సమయంలో సముద్ర తీర వాసులు తమను కాపాడాలని గంగమ్మకు పూజలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి సీన్లు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. వరుణుడా ఇక శాంతించు అంటూ సిటీ జనాలు ప్రార్ధనలు చేస్తున్నారు. కాపాడు తల్లి అంటూ అమ్మవార్లను మొక్కుతున్నారు.