జగన్ ప్యాలెస్ కోసమే ఏపీ ప్రజల నోట్లో ఆల్-మట్టి..!
posted on Sep 6, 2021 @ 3:51PM
స్వలాభం లేనిదే సీఎం జగన్ ఏ పనీ చేయరంటారు. ఆయన చేసే ప్రతీ పనిలో ఎంతోకొంత లాభం వెనకేసుకుంటారని చెబుతారు. ఏపీలో జరిగే అన్నిరకాల మైనింగ్లో జగన్‌కు జే ట్యాక్స్ వెళుతుందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇక లిక్కర్ పాలసీలోనైతే లెక్కకు మించి దండుకుంటున్నారని అంటారు. ఊరూ-పేరు లేని బ్రాండ్స్ తీసుకురావడం వెనుక ఆ జే-ట్యాక్సే కారణమనే విమర్శ. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కై.. ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని.. వాటర్, కరెంట్ విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అంటారు. తాజాగా, కర్ణాటక విషయంలోనూ ఇలాంటి లాలూచీనే పడుతున్నారనేది టీడీపీ ఆరోపిస్తోంది. బెంగళూరులోని తన ప్యాలెస్‌ను కాపాడుకోవడానికే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని మాజీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.
రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని ఉమా నిలదీశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును దాదాపు ఐదున్నర మీటర్ల మేర పెంచి.. 18 అడుగుల మేర గేట్ల నిర్మాణం చేస్తుంటే.. సీఎం జగన్మోహన్‌రెడ్డి మొద్దునిద్రతో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే అక్రమ ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోయినా సీఎంలో కనీసం స్పందన లేదని తప్పుబట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం వాటా ఉందంటూ.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలుస్తుంటే.. జగన్ ఏం చేస్తున్నారని దేవినేని ఉమ నిలదీశారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల పరిరక్షణపై ఏనాడైనా అధికారులతో సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. గత 28 నెలల్లో పోలవరం పనులు ఎంత శాతం పూర్తిచేశారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.