ఇక నుండి రెండురోజులు చంద్రబాబు హైదరాబాద్లో.. కారణం అదేనా?
posted on Nov 26, 2015 @ 3:50PM
రాష్ట్రం విడిపోయిన కొత్తలో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఉండే ఏపీ కార్యకలాపాలు చూసేవారు. తరువాత వారానికి మూడు రోజులు విజయవాడలో ఉంటూ.. మూడు రోజులు హైదరాబాద్లో ఉంటూ పాలన సాగించేవారు. అనంతరం మొత్తానికే విజయవాడకి మకాం మార్చి అక్కడే ఉంటూ.. అక్కడి నుండే అన్ని చక్కదిద్దుతున్నారు. ఆయన హైదరాబాద్లో ఉన్న సచివాలయానికి వచ్చి కూడా చాలా రోజులే అయింది. ఒకవేళ హైదరాబాద్ వచ్చినా తన నివాసానికి వెళ్లి, మళ్లీ అక్కడినుండి నేరుగా విజయవాడకే తిరిగి వస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుండి హైదరాబాద్లో కూడా రెండు రోజులు ఉండి ఇక్కడ ఉన్న పార్టీ కార్యకలాపాల గురించి చూసుకోవాలని నిర్ణయించుకున్నారట.
కానీ చంద్రబాబు ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ నిర్ణయం వెనుక అసలు కారణం.. గ్రేటర్ ఎన్నికలని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో పట్టు కోల్పోకూడదని తనే స్వయంగా పార్టీ బాధ్యతలు దగ్గరుండి చూసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయి.. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో రెండు రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సారి ఎలాగైనా గ్రేటర్ లో అత్యధిక స్థానాలు సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నేతలకు గుర్తు చేసినట్టు సమాచారం. మొత్తానికి చంద్రబాబు హైదరాబాద్లో ఉండటానికి నిర్ణయించుకున్నారు. గతంలో అంటే కేసీఆర్ విమర్శించేవారు.. ఇప్పుడు కేసీఆర్ కూడా విమర్శించడం తగ్గించారు కాబట్టి.. చంద్రబాబుకు ఇక ఆ సమస్యలేదు.