చంద్రబాబు.. కేసీఆర్.. ఇద్దరూ ఒకేలా
posted on Sep 19, 2015 @ 2:53PM
రాష్ట్రం విడిపోకముందు ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నా రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య పోరు ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటపడిందో అప్పడినుండి వీరిద్దరి మధ్య మాటల యుద్ధాలతో ఉప్పు నిప్పులాగా తయారయ్యారు. కానీ వీరిద్దరి ఆలోచన ధోరణి మాత్రం ఒకేలా కనిపిస్తుంది. సీఎం పదవిలో ఉండి తమ రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి ఇద్దురూ బాగానే కష్టపడుతున్నారు.. అయితే రాష్ట్రాల అభివృద్ధిలో ఎక్కువగా సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు అయితే తను ముందునుంచే తన పరిపాలనా విధానంలో సాంకేతికకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా తన పరిపాలనా కార్యక్రమాల్లో సాంకేతికతను జోడించనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జియో ట్యాగింగ్ విధానాన్ని ఉపయోగించనున్నారు.
జియో ట్యాగింగ్ సాంకేతికా విధానాన్ని ముందు చంద్రబాబు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత ఏడాది వైజాగ్ లో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ కారణంగ్ అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అందుబాటులోకి తెచ్చిందే జియో ట్యాగింగ్. ఈ పద్దతి ద్వారా సీఎం చంద్రబాబు వైజాగ్ లో జరిగిన పునరుద్దరణ పనులను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించేవారు.
ఇప్పుడు అదే జియో ట్యాగింగ్ విధానాన్ని కేసీఆర్ తన చేపడుతున్న అనేక పథకాలకు ఈ విధానాన్ని అనుసంధానం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ముందు ఈ విధానాన్ని పంచాయితీరాజ్ శాఖలో అమలు చేసి తరువాత తదుపరి ఇతర శాఖలకు అనుసంధానం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు జియోట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మొత్తానికి ఇద్దరు సీఎంలు ఎలా ఉన్నా వారు ఒకే ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.