Read more!

వైసీపీ చెత్తని ఫిల్టర్ చేయండయ్యా!

ఈ ఎన్నికలలో ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయిందని, తెలుగుదేశం విజయం పక్కా అని తెలిసిపోవడంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు పసుపు కండువా కప్పుకుంటున్నారు. వైసీపీ నుంచి తప్పుకుంటే చాలు భగవంతుడా అన్నట్టుగా చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బేషరతుగా టీడీపీలోకి వరదలా వస్తున్నారు. సాధారణంగా వరద అంటే కేవలం నీరు మాత్రమే కాదు.. చెత్తా చెదారం కూడా ఆ నీటితోపాటు వస్తుంది.

ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వరద కూడా అలాంటి చెత్తా చెదారాన్ని పుష్కలంగా కలిగి వుంది. మొన్నటి వరకూ వైసీపీలో వుండి సదరు పార్టీ అరాచకాల్లో భాగం పంచుకుని, ఇప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని తెలియగానే చడీ చప్పుడు కాకుండా, అమాయకపు చక్రవర్తుల్లా ముఖాలు పెట్టుకుని టీడీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి వస్తున్నారు కదా అని ముందూ వెనుకా ఆలోచించకుండా పార్టీలోకి చేర్చుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం కంటే నష్టం జరిగే అవకాశం వుంటుంది.

పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరగడానికి ఈ వైసీపీ చెత్త కూడా ఒక కారణం అయ్యే అవకాశం వుంది. అందువల్ల తెలుగుదేశం నాయకులు వైసీపీ నుంచి వచ్చే చేరికల వరదకు గేట్లు తీసే ముందు చెత్తను ఫిల్టర్ చేసే జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది.