ఏపీ సీఎంఓలో డిజిటల్ సిగ్నేచర్స్ దుర్వినియోగం.. విచారణకు దిగిన సీఐడీ!
posted on Aug 13, 2023 8:33AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యాలయంలో మరో మోసం బయటపడింది. మోసం అని ఏదో సింపుల్ గా చెప్పుకొనే కన్నా.. అది తీవ్రమైన దుర్వినియోగంగా చెప్పుకోవచ్చు. అదే డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్యన ఉండే ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంత మంది కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేయగా.. సీఎంఓలో పనిచేసే రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న వారు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేసినట్లు ఎస్పీ చెప్పారు.
ఈ కేసులో ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంచలన వివరాలు వెల్లడించారు. జగన్ సీఎంఓలో పనిచేస్తున్న కొందరు గత కొన్ని నెలలుగా కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేశారని.. కార్యదర్శుల ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ లను వినియోగించి.. ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థనలను, సీఎం పిటిషన్లు తయారీ చేసి వీటిని సంబంధిత శాఖలకు పంపిస్తున్నారని చెప్పారు. ఇదంతా సీఎంవో కార్యదర్శులకు తెలియకుండానే వీరు చక్కబెట్టి భారీగా డబ్బులు దండుకొని పంచుకున్నారని వెల్లడించారు. సీఎం పిటిషన్లను ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ, సీఎం సంతకాలను కాపీ, పేస్ట్ చేసి పంపించి వారి నుండి డబ్బులు తీసుకున్నారని.. వీళ్లు ఇలా ఒక్కొక్క ఫైల్ ప్రాసెస్ చేయడానికి రూ.30 నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరిలో వీరిలా ప్రాసెస్ చేసిన ఒక ఫైల్ పై అనుమానం రావడంతో క్రాస్ చెక్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఒక్క కార్యదర్శి ఫైల్ పై అనుమానం రావడంతో మిగతా కార్యదర్శుల పేషీలు చెక్ చేస్తే మొత్తం 66 సీఎంపీలు ఫేక్ అని గుర్తించారట.
ఈ డిజిటల్ సిగ్నేచర్ల చోరీ కేసులో ఇప్పటికే ఆరుగురి మీద కేసులు నమోదు చేయగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కనమర్ల శ్రీను (ముత్యాల రాజు పేషీలో మాజీ డీఈఓ), నలజల సాయి రామ్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో), గుత్తుల సీతారామయ్య (ధనుంజయ రెడ్డి పేషీలో అడెంటర్), చైతన్య (ముత్యాలరాజు పేషి), అబ్దుల్ రజాక్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో) ఉన్నట్లు సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అయితే సీఐడీ ఎస్పీ చెప్పిన వివరాలతో పాటు ఏకంగా సీఎం జగన్ డిజిటల్ సిగ్నేచర్ కూడా దుర్వినియోగం అయ్యిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఇప్పుడు ప్రభుత్వ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెక్రటరీ, సీఎం సంతకాలను కాపీ చేసినట్లు సీఐడీ ఎస్పీ చాలా చాలా మృదువుగా చెప్పారు కానీ వాస్తవానికి కాపీ చేసినా చోరీ చేసినా ఒక్కటే. కారణం అది సంతకం. సంతకం విలువ ఏంటో.. అది ఫోర్జరీ చేస్తే ఎంతటి నేరమో అందరికీ తెలిసిందే.
అయితే, ఇక్కడ చోరీ అయింది ఒక్క ఉన్నతాధికారులైన కార్యదర్శులతో పాటు సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డిది కూడా. ఏకంగా సీఎం ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ కూడా దుర్వినియోగం చేయడం.. అది కూడా కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం సాగడం, పదుల కొద్దీ ఫైళ్లను ఎవరో అనామకులు క్లియర్ చేసి దందా నడిపారంటే ఒక సీఎంకి ఇంతకి మించిన అవమానం మరోటి ఉండదు. తన చుట్టూనే ఇంతటి తీవ్రమైన నేరాలు ఇన్ని నెలల పాటు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం.. ఏకంగా తన సిగ్నేచర్ ను కాపీ చేసి దందా నడుపుతున్నా సీఎం గమనించలేకపోయారంటే అసలు జగన్ సీఎంఓలో ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా సీఎం సంతకాన్ని చోరీ చేశారంటే ప్రజలలో పరువు పోతుందని భావించే ఇలా కార్యదర్శుల సంతకాలు దుర్వినియోగం చేశారని, సీఎం సంతకాన్ని కాపీ పేస్ట్ చేశారని మెలిక పెట్టి సీఐడీ ఎస్పీతో చెప్పించినట్లుగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. తన సంతకాన్ని కాపాడుకోలేని సీఎం ఇక రాష్ట్ర ప్రజలను ఏం కాపాడతారని ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.